Organ Donation: తెలంగాణ జీవన్‌దాన్‌కు అంతర్జాతీయ అవార్డు

Organ Donation: తెలంగాణ జీవన్‌దాన్‌కు అంతర్జాతీయ అవార్డు
X
అంతర్జాతీయస్థాయి లో జీవన్‌దాన్‌ ఖ్యాతి

తెలంగాణ జీవన్‌దాన్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. మరణించిన వారి అవయవాలను సేకరించి ఆర్గాన్స్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అసాధారణమైన కృషిచేసినందుకుగానూ అంతర్జాతీయస్థాయి లో జీవన్‌దాన్‌ ఖ్యాతి గడించింది. దుబాయిలోని కాన్రాడ్‌ హోటల్‌లో జరిగిన యూఏఈ వార్షిక ఆర్గాన్‌ డొనేషన్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ కాంగ్రెస్‌లో తెలంగాణ జీవన్‌దాన్‌కు ‘హయత్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌లెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌’ అవార్డు దక్కింది.

అన్ని దానాల్లో అవయవదానం గొప్పది.. తాను పోతూ కూడా మిగతావారిలో బతికుండటమే ఈ అవయవదానం గొప్పతనం. ఇలాంటి సత్కార్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఈ విలువైన అవయవదానంలో రెండో స్థానంలో నిలచింది తెలంగాణ. అవయవదాన ప్రాముఖ్యతపై ప్రజలకు తెలంగాణ సర్కారు కల్పిస్తున్న అవగాహన స్పలితాలిస్తోంది. అవయవదానం, టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యుత్తమ సేవల అందిస్తూ.. ఎన్నో ప్రాణాలను నిలుపుతోంది.

డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం.. 5 లక్షల మంది అవయవాలు ఫెయిలై చనిపోతున్నారు. అయితే... ఇలాంటి వారి ప్రాణాలు నిలబెట్టాలంటే.. అవసరమైన అవయవ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 2012లో రాష్ట్ర సర్కార్ "జీవన్‌ధాన్‌" పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. అవయవదానం ప్రాముఖ్యత, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు కృషి చేసింది.


ఈ అవార్డును యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నేషనల్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ అలీ అబ్దుల్‌ కరీం ఓబైద్లి, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ మరియా పాలా గోమెజ్‌ చేతుల మీదుగా జీవన్‌దాన్‌ తెలంగాణ ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్వర్ణలత అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ స్వర్ణలతను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. గురువారం నిమ్స్‌ దవాఖానలో డా క్టర్‌ స్వర్ణలతకు డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, డీన్‌ డా క్టర్‌ లీజా రాజశేఖర్‌, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ సాయిబాబా, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శాం తివీర్‌, వైద్యులు అభినందనలు తెలిపారు. ఒకప్పుడు కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను కేసీఆర్‌ సర్కారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించింది.

ప్రభుత్వ కృషితో.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన ఏర్పడింది. జనాల నుంచి వచ్చిన ఆదరణతో.. తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలిచింది. దీన్ని గుర్తించిన కేంద్రం సర్కారు.. గతంలో ఢిల్లీలో జరిగిన అవయవదాన దినోత్సవంలో రాష్ర్టానికి ఉత్తమ అవార్డు అందజేసింది. జీవన్‌దాన్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు 2015లో స్కోచ్‌ అవార్డు కూడా రావటం గమనార్హం.

Tags

Next Story