TS: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

TS: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
X
ఒకే రోజు రూ. 56,300 కోట్ల పెట్టుబడులు.. 10 వేలకుపైగా ఉద్యోగావకాశాలు

దావోస్ ఆర్థిక సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఒకేరోజు రూ.56,300 కోట్ల విలువైన పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది. తద్వారా కొత్తగా 10 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు మూడు కంపెనీలతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలీవర్ కంపెనీ ముందుకు రాగా.. తాజాగా ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్కైరూట్ కంపెనీ తెలంగాణలో దాదాపు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీనిపై సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు.

భారీ పెట్టుబడులు

సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ప్రకటించింది. నాగర్‌కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను సీఎం అభినందించారు. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.

ఈ ఒప్పందం ఓ మైలురాయి

సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గత ఏడాది దావోస్‌లో జరిగిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల రికార్డును ఈ ఒప్పందం సమం చేసిందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story