కామారెడ్డి ఐపీఎల్ బెట్టింగ్ కేసు

కామారెడ్డి జిల్లా పోలీసు శాఖకు ఐపీఎల్ బెట్టింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. పోలీసు శాఖలో అక్రమ వసూళ్లతో పాటు అధికారుల ఆస్తులపై ఏసీబీ నిఘా పెట్టింది. ఇప్పటికే సీఐ, ఎస్‌ఐ సహా ఒక మధ్యవర్తిని అరెస్ట్ చేయగా... ఇప్పుడు తాజాగా డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి, హైదరాబాద్‌లలో డీఎస్పీ లక్ష్మీనారాయణకు చెందిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో డిపార్ట్ మెంట్‌కు సంబంధంలేని ఆయుధాలు, తూటాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ వరుస దాడులతో ఇప్పుడు కామరెడ్డి ఖాకీలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ సుధాకర్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికి స్టేషన్ బెయిల్ వచ్చేలా సుజయ్ అనే మరో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడు. బెయిల్ ఇచ్చేందుకు సీఐ జగదీష్ 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా లక్షా 39 వేలు ఇచ్చి బెయిల్ వచ్చాక మిగతా డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. మిగతా డబ్బుల కోసం సీఐ జగదీష్ వేధించడంతో విసుగు చెందిన సుధాకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అసలు గుట్టంతా బయటపడింది. సీఐ జగదీష్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కామారెడ్డి టౌన్ ఎస్సై గోవింద్ పేరు కూడా బయటికొచ్చింది.. బెయిల్ కోసం ష్యూరిటీలను ధ్రువీకరించేందుకు ఎస్సై గోవింద్ నిందితుడి నుంచి 20వేలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోఇద్దరు కానిస్టేబుళ్లకూ బెట్టింగ్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.
ఇప్పడు డీఎస్పీ స్థాయి అధికారి కూడా ఈ కేసులో ఉన్నట్లు తేలడం.. కామారెడ్డి పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. మరికొంతమంది ఖాకీల పేర్లు ఈ వ్యవహారంలో బయటకు రావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం కావడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వసూళ్ల వ్యవహారం ఇంకెంతమంది మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com