KTR: మోదీ ఏజెంట్లుగా గవర్నర్లు

KTR: మోదీ ఏజెంట్లుగా గవర్నర్లు
ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించటంపై ఘాటుగా స్పందించిన కేటీఆర్‌... మోదీ పర్యటనపై విమర్శనాస్త్రాలు...

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ఘాటుగా స్పందించారు. గవర్నర్లు మోదీ ఏజెంట్లుగా పని చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే తిరస్కరించేవారు కాదంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పాలమూరుకు ప్రధాని నరేంద్రం మోదీ వస్తున్న నేపథ్యంలో కేటీఆర్‌ చురకలు అంటించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మాట్లాడిన తీరును తప్పుబట్టారు. తెలంగాణ ఏర్పడ్డా సంబురాలు చేసుకోలేదంటూ వ్యాఖ్యానించిన ప్రధాని.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్‌ చేశారు.


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రధానిని నిలదీశారు. అటు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలంగాణలో నిర్వహిస్తున్న నిరసనలపై KTR స్పందించారు. APలో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందని.. దానికి తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై తటస్థంగా ఉంటున్నామని, ఆంధ్రాలో పంచాయితీ ఆంధ్రాలో తేల్చుకోవాలంటూ.. కేటీఆర్ సూచించారు.

మరోవైపు హైదరాబాద్ లో కూకట్ పల్లి జేఎన్ టీయూ సమీపంలో నిర్మించిన లులు మాల్ ను నేడు మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లులు మాల్ ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్న ప్రతినిధులు, 75 కంటే ఎక్కువ స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్ లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 1400 మంది సీటింగ్ సామర్థ్యంలో 5 సినిమా స్క్రీన్స్ తోపాటు పుడ్ కోర్టులు, పిల్లల వినోదానికి కావల్సిన అన్నిరకాల గేమ్స్ ను మాల్ లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర రైతులను సంప్రదించి నేరుగా వారి వద్ద నుంచి కూరగాయలను కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. మాల్ ద్వారా స్థానికంగా 2 వేల మందికి ఉపాధి కల్పించినట్లు లులు సంస్థ ప్రాంతీయ మేనేజర్ అబ్దుల్ ఖదీర్ తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని కూడా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని.. మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రగతిభవన్ లోనే కేసీఆర్ కు ఆయన వైద్యుల బృందం చికిత్స చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కొన్ని రోజుల్లో సీఎం సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story