IT RAIDS: కలకలం రేపుతున్న ఐటీ సోదాలు

IT RAIDS: కలకలం రేపుతున్న ఐటీ సోదాలు
తెలంగాణలో కాంగ్రెస్ నేతల ఇంట్లో ఐటీ సోదాలు... రాజకీయ కక్ష సాధింపేనన్న రేవంత్‌రెడ్డి

తెలంగాణలో ఎన్నికల హడావుడి వేళ పలువురు నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకుల నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ కక్ష సాధింపునకే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు అదే టికెట్‌ ఆశించిన బడంగపేట్‌ మేయర్‌ పారిజాత ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి.


ఆరుగురు సభ్యుల అధికారుల బృందం బాలాపూర్‌లోని పారిజాత ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నరసింహరెడ్డి ఇంట్లో లేకపోగా దిల్లీ వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారిని వెంటనే రమ్మని కబురు పెట్టిన అధికారులు అందరి ఫోన్లు స్వాధీనం చేసుకుని సోదాలు ప్రారంభించారు. స్థిరాస్తి వ్యాపారం చేసే నరసింహారెడ్డి సాయంత్రం 5 గంటల సమయంలో తిరిగివచ్చారు. మేయర్‌ పారిజాతను ఐటీ అధికారులు తిరుపతిలో అదుపులో తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి రెడ్డిభవన్‌కు వచ్చిన ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్న కక్షతోనే ఐటీ అధికారులతో దాడులు చేయించారని ఆమె ఆరోపించారు.

బాలాపూర్‌కే చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వంగేట లక్ష్మారెడ్డి ఇంటికి కూడా ఆదాయ పన్నుశాఖ అధికారులు వెళ్లారు. ఆయన భార్య గత మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోగా లక్ష్మారెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు... శంకర్‌పల్లి మండలం మాసానిగూడతోపాటు చేవెళ్ల మండలం తంగడపల్లి, శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడలలో ఉన్న కాంగ్రెస్‌ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రాలకు నిన్న ఉదయం 6 గంటలకే అధికారులు చేరుకొని.. సోదాలు ప్రారంభించారు. విషయం తెలియడంతో బహదూర్‌గూడ వ్యవసాయ క్షేత్రం వద్దకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. CM కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ఆందోళనకు దిగగా అధికారులు సముదాయించారు. సోదాల సందర్భంగా కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోకాపేటలో నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేత బంధువు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఆయన కూడా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పారని PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story