Jaahnavi Kandula: జాహ్నవి కందుల కేసులో కీలక మలుపు

అమెరికాలో జాహ్నవి కందుల మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డేనియల్ అడెరెర్ అనే పోలీసును ఉద్యోగంలో నుంచి తొలగించారు. మృతి చెందిన సమయంలో అడెరెర్ మాటలు మనసును గాయపర్చేలా ఉన్నాయని సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ రహర్ పేర్కొన్నారు. జాహ్నవి మృతిపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపర్చాయని రహర్ తెలిపారు.
అసలేం జరిగిందంటే? ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్, చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి అప్పట్లో వైరల్‌గా మారింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని మోదీ ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. అడెరెర్‌ను అప్పట్లోనే సస్పెండ్ చేసిన అమెరికా ఉన్నతాధికారులు తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ రహర్ స్పంధించారు. జాహ్నవి మృతిపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపర్చాయని రహర్ తెలిపారు. వాటిని ఎవరూ మాన్పలేరని పేర్కొన్నారు. అడెరెర్ మాటలు సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చ తెచ్చాయని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు పోలీసు వృత్తికే సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని వ్యాఖ్యానించారు.
ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం పోలీసుల బాధ్యతని రహర్ గుర్తుచేశారు. ఉన్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అడెరెర్‌ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ని ఉద్యోగంలో నుంచి తొలగించేస్తున్నట్లు రహర్ స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com