నాగార్జునసాగర్‌లో జానారెడ్డి విజయం ఖాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాగార్జునసాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఓవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరుఫున పీసీసీ ఉత్తమ్ సహా పార్టీ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాకూర్.. జూమ్ యాప్ ద్వారా పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
ఈ కీలక సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అభ్యర్థి జానారెడ్డితో పాటు సీనియర్ నేతలు, ముఖ్యనాయకులు, మండలం ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. ప్రచారం విధివిధానాలపై నేతలకు ఠాకూర్ దిశానిర్ధేశం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని.. ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తిస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మాణికం ఠాకూర్ స్పష్టంచేశారు.
నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి విజయం ఖాయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే బీజేపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా ఆగమ్యగోచరంగా ఉందన్న ఉత్తమ్.. ఉద్యోగాలు రావడం లేదని సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. సమయం తక్కువగా ఉందని.. ప్రతిఒక్కరూ పూర్తి స్థాయిలో కష్టపడి ఈ ఉప ఎన్నికలో జానారెడ్డిని గెలిపించుకోవాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సాగర్ నియోజకవర్గంలో చేపట్టే ప్రచార వ్యూహాలను మాణికం ఠాకూర్‌కు వివరించారు. ప్రతి కార్యకర్త అభ్యర్థి జానారెడ్డి విజయం కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. సాగర్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు కావాలని.. అందుకు ప్రజా విజయంగా కాంగ్రెస్ గెలుపును కార్యకర్తలు కృషి చేయాలని భట్టి విక్రమార్క్ స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అయినా అక్కడి ప్రజలు గట్టెక్కిస్తారో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com