Janwada Farmhouse Case: తెలంగాణలో ఫామ్ హౌస్ కేసు రచ్చ

Janwada Farmhouse Case: తెలంగాణలో ఫామ్ హౌస్ కేసు రచ్చ
X
అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్‌ కేసు ఇప్పుడు తెలంగాణలో రచ్చ రేపుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. తనపై అరెస్టు చర్యలు తీసుకోకుండా నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి, తాను నిర్దోషినని.. పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయనకు పోలీసుల ఎదుట హాజరు కావడానికి రెండు రోజుల గడువు ఇచ్చింది. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టాన్ని అతిక్రమించవద్దని సూచించింది. రాజ్ పాకాల తరఫున మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇంట్లో జరిగే పార్టీకి పోలీసులు అక్రమంగా దాడి చేశారని, సంస్థ ఉద్యోగికి డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినా రాజ్ పాకాలపై దోషారోపణలు చేశారని కోర్టుకు తెలిపారు.


కేటీఆర్ సతీమణి విచారణ

తెలంగాణ పాలిటిక్స్‎లో కాకరేపిన జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఫామ్ హౌస్‎లో పార్టీకి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణిని పోలీసులు విచారించారు. మరోవైపు.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఆదివారం విచారణకు హాజరైన విజయ్ మద్దూరి.. సోమవారం పోలీసుల దర్యాప్తుకు డుమ్మా కొట్టాడు. రైడ్ సమయంలో తన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్‎ను విజయ్ మద్దూరి తమకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన మొబైల్ దొరికితే డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతోనే విజయ మద్దూరి వేరే మహిళ ఫోన్ అందజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడుల సమయంలో విజయ్ మద్దూరి సతీమణి ఆయన పక్కనే ఉండగా.. తన సతీమణి నెంబర్ కాకుండా థర్డ్ పర్సన్ నెంబర్‎ను ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

మాటల యుద్ధం

రాజ్ పాకాల ఫామ్ హౌస్‌ కేసులో స్థానికుల సమాచారంతో వెంటనే తనిఖీలు చేశామని పోలీసులు ప్రకటించారు. ఆ తనిఖీల్లో ఫారిన్ లిక్కర్ దొరికిందన్నారు. కానీ డ్రగ్స్ దొరకలేదు. ఆ పార్టీలలో పాల్గొన్న ఓ వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అంతే ఈ వ్యవహారం సంచలనాత్మకం అయింది. అది రేవ్ పార్టీగా ప్రచారం జరిగింది. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. హైప్రోఫైల్ కేసు కావడం .. ఓ వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ రావడం కొత్త మలుపులకు కారణం అయింది.

Tags

Next Story