JEEVAN REDDY: కాంగ్రెస్కు చేయి ఇచ్చి.. కారుఎక్కనున్న జీవన్ రెడ్డి..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో ఏర్పడిన పరిణామాలు ఆయన అసంతృప్తికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత కూడా పార్టీ పట్ల విధేయత కొనసాగించిన జీవన్ రెడ్డి, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో జీవన్ రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య చాలా కాలంగా తీవ్ర విభేదాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తరఫున గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. అయితే తర్వాత రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రమే కాకుండా, ప్రభుత్వం మరియు పార్టీలో ప్రాధాన్యం పెరగడం జీవన్ రెడ్డికి అసంతృప్తి కలిగించిన అంశంగా మారింది. తనను సంప్రదించకుండానే రాజకీయ ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకోవడం అవమానంగా భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత హైదరాబాద్లో కేసీఆర్ను కలిసి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం జగిత్యాల ప్రాంతంలో తన అనుచరులు, ముఖ్య నాయకులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ మార్పుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టగా, ఎక్కువ మంది అనుచరులు ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, జీవన్ రెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. . ముఖ్యమంత్రి రేవంత్ సహా పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయినప్పటికీ, సంజయ్ కుమార్ అంశంలో తనకు జరిగిన అన్యాయంపై జీవన్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనను పక్కనపెట్టి ప్రత్యర్థిని ప్రాధాన్యానికి తీసుకురావడం సరైంది కాదని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే సూచనలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
