Kcr : కామారెడ్డిలో కేసీఆర్ పై బీజేపీ అభ్యర్ధి గెలుపు

ఉత్కంఠభరితంగా సాగిన కామారెడ్డి ఓట్ల కౌంటింగ్ లో చివరకు విజయం బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డినే వరించింది. ఆయన ఆరువేల పైచిలుకు ఓట్లతో తన సమీప అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ పై గెలిచారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ప్రతి రౌండ్ కూ మెజారిటీలు మారుతూ ఉండటంతో కామారెడ్డి ఎన్నికల ఫలితం ఎంతో ఉత్కంఠకు గురి చేసింది.
బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి 6 వేలకు పైగా మెజార్టీ తో సంచలన విజయం సాధించారు. మొదటి 13 రౌండ్లు రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 14వ రౌండు నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందుకు వచ్చారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై 4,273 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చివరి రౌండ్లలో రేవంత్ రెడ్డి మూడోస్థానానికి పడిపోయారు.
వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీకి దిగగానే.. కాంగ్రెస్ చీఫ్, రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఎన్నికల చర్చంతా ఈ ఇద్దరు నేతల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే అంచనాలే వచ్చాయి. అయితే ఆ ఇద్దరినీ ఓడిస్తానంటూ వెంకటరమణారెడ్డి ముందు నుంచి చెప్తున్నప్పటికీ.. బహిరంగ చర్చలో మాత్రం దానికి అంత ప్రాధాన్యత లభించలేదు. కానీ, ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్టుల మధ్య చివరికి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.
ఓటమి తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com