JP Nadda: మోడీ అంటే 5జి ఇంటర్నెట్ : జేపీ నడ్డా

JP Nadda: మోడీ అంటే 5జి ఇంటర్నెట్ : జేపీ నడ్డా
కేసీఆర్, కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి: బీజేపీ చీఫ్

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ... కాషాయదళం ప్రచార జోరు పెంచింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రచారం నిర్వహించగా.. తాజాగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్దారించే ఎన్నికలని.. రాష్ట్ర స్వరూపాన్నే మార్చనున్నాయని నడ్డా పేర్కొన్నారు. నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో.. ఆయన పాల్గొన్నారు. ఓ వైపు మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు పంపిస్తుంటే.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం అవినీతీకి పాల్పడుతోందని.. నారాయణపేట సభలో నడ్డా మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటిలు ఎక్కడ అమలు అయ్యాయని.. గతంలో ఉండే 24 గంటల కరెంటు.. ఇప్పుడు 4 గంటలు మాత్రమే వస్తుందన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ ఇద్దరు ఒక్కటే అని.. వీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ కుంభకోణాలు ఉంటాయనేది గ్యారంటీ అంటూ నడ్డా ధ్వజమెత్తారు.


అనంతరం చేవెళ్ల సభలో పాల్గొన్న నడ్డా... భారాస అంటే అవినీతి రాక్షసుల పార్టీ అంటూ అభివర్ణించారు. మియాపూర్‌లో 4వేల కోట్లు విలువ చేసే 633 ఎకరాల భూమిని కాజేశారని.. ఔటర్‌ రింగ్ రోడ్డు పేరు చెప్పి వెయ్యి కోట్లు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో దేవాలయ భూములకు రక్షణ లేకుండా పోయిందని, షాబాద్ మండలంలోని సీతారాంపూర్‌లో దేవాలయ భూములను రైతులకు నామమాత్రపు పరిహారం ఇచ్చి లాక్కున్నారని ఆరోపించారు. ఆ భూములను పరిశ్రమలకు కేటాయించి ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్.... కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు. తెలంగాణలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోదీ ప్రజల కోసం పని చేస్తుంటే కేసీఆర్ సంతుష్టీకరణ కోసం పాలిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా? అని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ.. అవినీతి రాజ్యమేలుతుందన్నారు. నారాయణపేట, చేవెళ్ల సభల అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న జె.పి.నడ్డా... మల్కాజ్‌గిరిలో రోడ్‌ షోలో పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారసత్వ రాజకీయాలపై పోరాడుతున్న పార్టీ బీజేపీనేని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేసి కేసీఆర్ ను జైలుకు పంపుతామన్నారు. ఎన్నో ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story