కొలువుదీరనున్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన పాలకమండలి

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన పాలకమండలి ఇవాళ కొలువుదీరనుంది. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన JHWS ప్యానల్ సభ్యులు.. ఇప్పటికే గుర్తింపు పత్రాలు తీసుకున్నారు. తర్వాతి షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, కోశాధికారి పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్ష పదవికి టీవీ5 MD బొల్లినేని రవీంద్రనాథ్ నామినేషన్ వేశారు.
ఇక ఉపాధ్యక్ష పదవికి డి.సునీలా రెడ్డి, సొసైటీ కార్యదర్శిగా మురళీ ముకుంద్, అదనపు కార్యదర్శిగా ఆదాల హిమబిందు రెడ్డి, కోశాధికారిగా నాగరాజు నామినేషన్లు వేశారు. అన్ని పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలవడంతో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. తెలంగాణ రాష్ట్ర సహకార శాఖ తరపున ఈ ఎన్నికను పర్యవేక్షిస్తున్న రిటర్నింగ్ అధికారులు.. మధ్యాహ్నం 2.30 తర్వాత కొత్త కార్యవర్గం ఎన్నికపై అధికారికంగా ప్రకటన చేస్తారు.
గత సొసైటీలో జరిగిన అక్రమాల్ని వెలికి తీయడంతోపాటు, కబ్జాకు గురైన స్థలాల్ని తిరిగి సొసైటికి వచ్చేలా చేయడం తమ కర్తవ్యమని JHS అధ్యక్షులు బొల్లినేని రవీంద్రనాథ్ అన్నారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ.. ఆ నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సొసైటీలో ఉన్న 5 వేల 200 మంది సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తామని, కాంక్రీట్ జంగిల్‌లా మారుతున్న జూబ్లీహిల్స్ ప్రాంతంలో మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనాన్ని వృద్ధిచేస్తామన్నారు. ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుగోలు చేస్తే వెంటనే మెంబర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com