JUBLEEHILLS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. జూబ్లీహిల్స్ బై పోల్ నిర్వహణకు నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తూ ఎన్నికల అధికారి అర్వీ కర్ణణ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల ద్వారా ప్రత్యర్థి పార్టీల పైన కాంగ్రెస్ పై చేయి సాధించామనే అభిప్రాయంతో ఉంది. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో తదుపరి కార్యాచరణ పైన కసరత్తు చేస్తోంది. పథకాల అమలు వేగం పెరగటంతో స్థానిక సంస్థల ఎన్నికల పైన కీలక నిర్ణయానికి సిద్దమైంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరో 79 పోలింగ్ బూత్‌లు పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు డీఎంసీ రజినీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-19 కార్యాలయంలో శనివారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 329 పోలింగ్ కేంద్రాలను పెంచాలనే నిర్ణయాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయన్నారు. ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు ఆంగ్లం, తెలుగులోనూ ప్రచురించాలని సీపీఎం నేత సాయిశేషగిరిరావు కోరగా..ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రజినీకాంత్ తెలిపారు.
బీఆర్ఎస్ రెడీ.. ?
బీఆర్ఎస్ బై పోల్ మూడ్‌లోకి వచ్చేసిందా? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిందా? ఎప్పుడు సైరన్ మోగినా మేము సై అంటూ సిద్ధమైపోతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి… తర్వాత కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోయారు పది మంది ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌ని కోరింది బీఆర్ఎస్. ఆ పోరాటంలో భాగంగా సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళింది. తాజాగా వచ్చిన తీర్పు తమకు అనుకూలంగా ఉన్నట్టు భావిస్తున్నారు గులాబీ నేతలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతిని మూడు నెలల్లోగా తేల్చమని స్పీకర్‌కు సూచించింది సుప్రీమ్ కోర్ట్. అందులో భాగంగా కొందరు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. మరి కొంత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా త్వరలో నోటీసులు అందుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే… వాళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత పడుతుందని కారు పార్టీ గట్టిగా నమ్ముతున్నట్టుందని అంటున్నారు . అలా అయితే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com