TS: కాళేశ్వరంపై న్యాయ విచారణ

TS: కాళేశ్వరంపై న్యాయ విచారణ
ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రుల ప్రకటన... ప్రజా ధనం దుర్వినియోగం చేశారని విమర్శ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో అక్కడ తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొనగా వైఎస్ హయాంలో తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ఉన్న సవాళ్లు, మహారాష్ట్రతో జరిపిన సంప్రదింపులు, తర్వాత రీడిజైనింగ్ ద్వారా... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న చర్యలను..నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వివరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు,పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టువల్ల కలిగిన లాభనష్టాలు, కొత్త ఆయకట్టు, ఆయకట్టు స్థిరీకరణ.., ఇతర అంశాలను ఈఎన్‌సీ వివరించారు. కాళేశ్వరం నిర్మించిన తర్వాత... 98వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చామని తెలిపిన ఈఎన్‌సీ ఆయకట్టు స్థిరీకరణలో మాత్రమే లక్ష్యానికి చేరువైనట్టు వివరించారు.


మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాకులోని పియర్స్ కుంగడానికి ప్రాథమిక కారణాలు, తదుపరి పరిశోధనలు, మరమ్మతుల అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. ఏడో బ్లాక్‌లోని మూడు పియర్స్ దెబ్బతిన్నాయని వాటిని పూర్తిగా తొలగించాల్సిందేనని తెలిపారు. తొలగింపు పెద్ద సవాలేనన్న ENC బ్లాస్టింగ్‌కు అవకాశం లేనందున డైమండ్ కటింగ్ విధానంలో తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానంపై మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన ప్రాజెక్టులను నాణ్యత లేకుండా నిర్మించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాము చెబుతూ వచ్చిన విషయాలు నిజమయ్యాయన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్వరలో న్యాయ విచారణ చేపడతామని చెప్పారు. గ్రావిటీతో నీరు ఇచ్చే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ రకాల పనులు సాగుతున్నాయన్న ENC...కొత్త టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.


బాధ్యతగా ఉండాల్సిన అధికారులు, ఇంజినీర్లు గత ముఖ్యమంత్రి ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ఎలా సమర్థించారని ప్రశ్నించారు. ఇష్టానుసారం నిర్మించిన బ్యారేజీలతో భవిష్యత్తులో నెలకొనే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మార్కు కోసం ఆతృత, హడావిడిగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ప్రజా ప్రయోజనాలను గాలికొదిలేశారని అన్నారు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ అనంతరం మంత్రుల బృందం...మేడిగడ్ద ఆనకట్టలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఏడో బ్లాకులో కుంగిన 19, 21 పియర్స్‌తోపాటు అక్కడి పరిస్థితులు, తీవ్రతను పరిశీలించారు. ఏడో బ్లాక్ వరకు నిర్మిస్తున్న కాఫర్ డ్యాం పనులను పరిశీలించి మరమ్మత్తుల గురించి ఆరా తీశారు. తర్వాత అన్నారం ఆనకట్టను కూడా పరిశీలించిన మంత్రులు...బుంగలు పడిన ప్రాంతం, చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story