Junior Doctors: జూనియర్ డాక్టర్ల సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 4 వేల మంది సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. స్టయిఫండ్ చెల్లింపులతోపాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. గత నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ వైద్యశాఖ మంత్రి కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగామన్నారు.
గత నెల 20న కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వటంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవటంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకొని విధులకు హాజరుకావటం వంటివి చేపట్టారు. ఆదివారం కండ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పట్టించుకోలేదు. దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com