TG: కాళేశ్వరం ఆనకట్టలపై కొనసాగుతున్నకమిషన్ విచారణ
ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్ PCఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా భారీ వ్యయంతో ఎత్తిపోతలలు చేపట్టాల్సిన అవసరం, అందుకు కారణాలను అన్వేషిస్తోంది.ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల సహా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై... ఐదుగురు సభ్యులతో కూడిన విశ్రాంత ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక, దానిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆరా తీస్తోంది.ప్రాణహిత చేవెళ్ల కాదని కాళేశ్వరం చేపట్టడంపై... ఎవరు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారో వివరాలు సమర్పించాలని తెలంగాణ నీటిపారుదలశాఖను కమిషన్ ఆదేశించింది.
గోదావరిలో నీరు ఉండగా ప్రాణహిత జలాలను ఎత్తిపోయాల్సిన అవసరమేంటనే అంశంపై.. ఆరా తీస్తోంది. ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్లానింగ్ పై పూణేలోని CWPRSనుంచి కూడా నివేదిక కోరారు. జూలై మొదటి వారంలో నివేదికలు వచ్చే అవకాశం ఉండగా విజిలెన్స్ విభాగం నుంచి తుది నివేదిక కోరారు. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ EN C జనరల్ కార్యాలయం, ఓ అండ్ ఎం విభాగాల ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించింది. ఇంతటితో..... ఇంజనీర్లకు సంబంధించి విచారణ దాదాపు పూర్తి కాగా..ఈనెల 27లోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక పూర్తిస్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.
మధ‌్యంతర నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై న్యాయ విచారణలో భాగంగా జస్టిస్ P.C.ఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక కోరింది. రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ సూచించింది. విచారణ ప్రక్రియలో భాగంగా, వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతోపాటు లోపాలను పరిశీలించింది. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్ కు వివరించారు. బ్యారేజీగా నిర్మించి ఎక్కువ నీటిని నిల్వ చేసినందునే సమస్య వచ్చిందని నిపుణులు చెప్పినట్లు తెలిసింది. విజిలెన్స్ నుంచీ నివేదిక కోరిన జస్టిస్ పీసీ ఘోష్ అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. పారదర్శకంగా విచారణ ప్రక్రియ ఉంటుందన్న కమిషన్ సాంకేతిక అంశాల తర్వాతే ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపింది. వ్యక్తుల నుంచి, ఇతర రూపాల్లో కూడా కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలోనే జస్టిస్ ఘోష్ ఆకస్మిక పర్యటనలకూ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com