KALESHWARAM: అధిక నీటి నిల్వ వల్లే కాళేశ్వరం బ్యారేజీల్లో సమస్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై న్యాయ విచారణలో భాగంగా జస్టిస్ P.C.ఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక కోరింది. రెండు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ సూచించింది. విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని.. ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడం సహా లోపాలను పరిశీలించింది. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్ కు వివరించారు. బ్యారేజీగా నిర్మించి ఎక్కువ నీటిని నిల్వ చేసినందునే సమస్య వచ్చిందని నిపుణులు చెప్పినట్లు తెలిసింది. విజిలెన్స్ నుంచి నివేదిక కోరిన జస్టిస్ పీసీ ఘోష్ అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. పారదర్శకంగా విచారణ ప్రక్రియ ఉంటుందన్నారు. సాంకేతిక అంశాల తర్వాతే ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తామని కమిషన్ తెలిపింది. వ్యక్తుల నుంచి, ఇతర రూపాల్లో కూడా కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో... జస్టిస్ ఘోష్ ఆకస్మిక పర్యటనలకూ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు ఆనకట్టల నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లను కమిషన్ విచారణ చేస్తోంది. ఆ సమయంలో ఒక్క రోజు విధులు నిర్వహించినా... వారిని కూడా పిలిచి విచారిస్తోంది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ తదితర విభాగాలకు చెందిన ఇంజనీర్లను కమిషన్ విచారణ చేసింది. మౌఖికంగా చెప్పిన అన్ని అంశాలను వివరిస్తూ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. అందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇచ్చారు. సీడీఓ, హైడ్రాలజీ, ఎస్డీఎస్ఏ ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణ చేసింది. ఇదే సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు నిర్మించిన ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థల ప్రతినిధులను కూడా విచారించిన జస్టిస్ ఘోష్... వారిని కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పారు. అటు కమిషన్ కు సాంకేతికరపరమైన అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఒక నిపుణుల కమిటీని నియమించారు.
జేఎన్టీయూ ప్రొఫెసర్ సీబీ కామేశ్వరరావు ఛైర్మన్ గా ఏర్పాటు అయిన కమిటీలో విశ్రాంత సీఈ సత్యనారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా... ఈఎన్సీ అనిల్ కుమార్ కన్వీనర్ గా ఉన్నారు. కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు లోపాలను పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలను అధ్యయనం చేశారు. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్ కు వివరించారు. డ్యాంలు, బ్యారేజీల నిర్మాణం విషయంలో అంతర్జాతీయంగా అనుసరించే ప్రమాణాలు, విధానాల గురించి కూడా తెలిపారు. అమెరికాలోని హడ్సన్ నది ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. కేవలం నీటిని మళ్లించేందుకు వీలుగా బ్యారేజీలను నిర్మించి ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసినందువల్లే మేడిగడ్డ సహా ఇతర చోట్ల సమస్యలు వచ్చాయని నిపుణుల కమిటీ చెప్పినట్లు సమాచారం. అన్ని పరిశీలన అంశాలతో రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. కమిటిలో ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన నిపుణుడిని కూడా చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com