KAVITHA: సీబీఐకి కవిత లేఖ

KAVITHA: సీబీఐకి కవిత లేఖ
విచారణకు హాజరు కావట్లేదని వెల్లడి.. వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతానన్న కవిత

పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల సీబీఐ ముందుకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సెక్షన్‌-41-A కింద సీబీఐ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు సీబీఐ నోటీసులు జారీ చేయడంలో అనేక ప్రశ్నలకు తావిస్తోందని కవిత ఉద్ఘాటించారు. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని... సీబీఐ దర్యాప్తునకు కూడా తప్పకుండా సహకరిస్తానని కవిత వెల్లడించారు.


ఏడాదిగా స్తబ్దుగా ఉన్న లిక్కర్ కేసు మరోసారి సంచలనాలు రేపుతోంది. కవిత ఢిల్లీ పీఏ అప్రూవర్‌గా మారడంతో.. ఆమెను నిందితురాలిగా చేరుస్తూ నోటీసులిచ్చింది సీబీఐ. ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు లేఖ రాశారు. కాగా, విచారణకు సమన్లను దాటవేయడం ఇది రెండోసారి. డిసెంబర్ 2022లో సెంట్రల్ ఏజెన్సీ ఆమెను చివరిగా ప్రశ్నించింది.

గతంలో సమాచారం కోసం కవితను హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి 160 సీఆర్‌పీసీ కింద ప్రశ్నించింది సీబీఐ. 2022 డిసెంబర్‌లో కవితను ప్రశ్నించింది సీబీఐ. ఇదే కేసులో ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ కూడా విచారించింది. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత ఢిల్లీ పీఏ అశోక్‌ కౌశిక్ అప్రూవర్‌గా మారడంతో.. కేసు కీలక మలుపు తిరిగింది. పీఏ అశోక్‌ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు. దీంతో.. అశోక్‌ను, కవితను నిందితులుగా చేర్చి, విచారించేందుకు సిద్ధమైంది సీబీఐ. మరోవైపు లిక్కర్ కేసులో ఈడీ నోటీసుల్ని ఇప్పటికే.. సుప్రీంలో సవాల్‌ చేశారు కవిత. ఆ పిటిషన్‌కి సంబంధించి ఫిబ్రవరి 28న విచారణ ఉంది. ఇదిలావుంటే నోటీసుల పేరుతో ఆమెను రప్పించి అరెస్టుకు రంగం సిద్ధం చేసిందన్న టాక్ వినిపిస్తోంది. పరిస్థితి గమనించిన కవిత.. సోమవారం హాజరుకావాల్సి ఉండగా, ఆదివారం సాయంత్రం సీబీఐకి లేఖ రాసింది.

Tags

Read MoreRead Less
Next Story