KTR: కవిత... కన్నవారిని కన్నీళ్లు పెట్టించకు

తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కల్వకుంట్ల కవిత 'కొత్త పార్టీ' అంశంపై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయంగానే కాకుండా, కుటుంబపరంగానూ తీవ్ర సంచలనం రేపుతున్నాయి. కవిత వ్యవహారశైలిపై కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ హితవు పలికారు. "కన్నవారిని కవిత ఏడిపించకూడదని నా సూచన. తల్లిదండ్రులకు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, వారు బాధపడే పనులు మాత్రం అస్సలు చేయకూడదు. కవిత ప్రవర్తన వల్ల తరచూ కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు." అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కవిత చాలా తెలివైన మహిళ, ఆమెకు రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుకుంటున్నాను." అని ఆయన పేర్కొన్నారు. కుటుంబంలో విభేదాలు పెరిగాయా? ఆ కారణంగానే కవిత కొత్త దారిని అన్వేషిస్తున్నారా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలు విస్తృతంగా వైరల్ అవుతూ, అనేక ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో, సొంత సోదరుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబంలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయా? అందుకే కవిత కొత్త దారి వెతుక్కుంటున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
భారత రాష్ట్ర సమితిని మళ్లీ పాత పేరైన తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. పొత్తుల రాజకీయాలు తమకు కలిసిరావని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో స్వతంత్రంగా ముందుకు వెళ్లే దిశగా పార్టీ ఆలోచిస్తున్నట్లు చెప్పారు. గతంలో కొన్ని తప్పిదాలు జరిగాయని అంగీకరించిన కేటీఆర్, ఆ కారణంగా ప్రజలకు మరియు నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో అనౌపచారికంగా మాట్లాడిన కేటీఆర్, రాబోయే రోజుల్లో తమ పార్టీ మళ్లీ బలంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా అవతరించే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అమలు చేస్తున్న పథకాల విషయంలో విఫలమైందని ఆరోపించారు. దేశ రాజకీయాల దిశగా కూడా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో డీలిమిటేషన్ కారణంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల పార్టీలు తెలంగాణలో ప్రవేశించడాన్ని వ్యతిరేకించలేమని, రాజకీయాల్లో ఇది సహజమేనని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
