Kadem Project: కడెం ప్రాజెక్ట్‌.. సామర్ధ్యానికి మించి వరద ప్రవాహం

Kadem Project: కడెం ప్రాజెక్ట్‌.. సామర్ధ్యానికి మించి వరద ప్రవాహం
X
Kadem Project: కడెం ప్రాజెక్ట్ వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారు.

Kadem Project: కడెం ప్రాజెక్ట్ వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రిని ఆదేశించారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్‌ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో, ముంపు గ్రామాలు, సహాయ చర్యల గురించి సీఎం కేసీఆర్‌కు వివరించారు మంత్రి అల్లోల. వరద కొంత తగ్గుముఖం పట్టిందని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌కు మంత్రి అల్లోల వివరించారు.

కడెం ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రాజెక్ట్‌ సామర్ధ్యానికి మించి వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్ట్‌కు 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్ట్‌ నుంచి మాత్రం కేవలం 3 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే బయటకు వెళ్తోంది. మొత్తం 17 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మరో గేటు తెరుచుకోలేదు. ఔట్‌ఫ్లో అనుకున్నంతగా లేకపోవడంతో.. ప్రాజెక్ట్‌ పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్ట్‌ పరిసర ప్రాంత ప్రజలు ఊరు వదిలి వెళ్లాలని అధికారులు చాటింపు వేయించారు. వీలైనంత వరకు పరివాహక ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం తరలిస్తోంది.

డ్యాం డిశ్చార్జ్ సామర్థ్యమే 3 లక్షల క్యూసెక్కులని.. కాని, ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు మించి వస్తుంటే ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. అన్ని గేట్లు ఓపెన్ చేసి నీటిని వదలడం, డిజాస్టర్ మేనేజ్ మెంట్‌కు సిద్ధపడటం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్‌లోకి ఊహించని రీతిలో వరద నీరు వస్తుండటంతో.. డ్యాం తెగిపోయే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

కడెం ప్రాజెక్టుకు ఇలాంటి పరిస్ధితి 1995లో ఎదురైందని గుర్తు చేస్తున్నారు అధికారులు. ఆనాడు చిన్నపాటి ప్రమాదంతోనే బయటపడ్డామని గుర్తుచేశారు. ఒకవేళ ఈసారి పరిస్థితి చేయి దాటితే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతామన్నారు. ఇంజినీర్లు, జిల్లా యంత్రాంగం మొత్తం సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదకర స్థితిలో కూడా ప్రాజెక్టు ఇంజినీర్లు గేజింగ్ రూంలో ఉండి వరద స్థితిని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

Tags

Next Story