Warangal: రాజయ్యపై మండిపడిన కడియం శ్రీహరి

Warangal: రాజయ్యపై మండిపడిన కడియం శ్రీహరి
తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. స్టేషన్‌ ఘన్‌పూర్ వేదికగా పేర్లు పెట్టి మరీ మాటల దాడికి దిగుతున్నారు. ఇన్ని రోజులు పరోక్షంగా విమర్శించుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యక్షంగా ఓరేంజ్‌లో విమర్శలు చేసుకుంటున్నారు.

ఇక తనపై తీవ్ర ఆరోపణలు చేసిన రాజయ్యకు కడియం శ్రీహరి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజయ్య తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ నియామవళిని దాటి తనపైనా, తన కుటుంబంపైనా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తావా అంటూ సవాల్ విసిరారు. తన తల్లి బీసీ అని.. తండ్రి ఎస్సీ అన్న కడియం శ్రీహరి.. తన పిల్లలు ఎస్సీ అవుతారని రాజయ్యకు ఆ మాత్రం తెలియదా? అని నిలదీశారు. తనపై అవినీతి ఆరోపణలు, ఎన్‌కౌంటర్లపై రాజయ్య చేసిన ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. తన అక్రమ ఆస్తులపై ఆధారాలను దమ్ముంటే చూపాలని సవాల్ విసిరారు. లేకుంటే క్షమాపణలు చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

అటు స్టేషన్‌ ఘన్‌పూర్ వేదికగా కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి ఓ పెద్ద అవినీతి తిమింగలమని.. భారీగా ఆస్తులు కూడ బెట్టారని విమర్శించారు. మంత్రిగా ఉన్న సమయంలో కడియం అనినీతి చేశారని ఆరోపించారు. అవసరం వచ్చినప్పుడు కడియం ఆస్తులను బయట పెడతామని చెప్పారు. ఏపీకి చెందిన వ్యక్తితో పెళ్లి చేసుకున్న కడియం శ్రీహరి కూతురు ఎస్సీ కాదని.. బీసీ-బీ కులానికి చెందుతారని రాజయ్య వ్యక్తిగత దూషణలకు దిగారు.. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇద్దరు సీనియర్ నాయకులు పరస్పరం మాటల యుద్ధానికి దిగడం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. స్టేషన్‌ ఘన్‌పూర్ అసెంబ్లీ టికెట్ కోసమే రాజయ్య, కడియం శ్రీహరి మధ్య రాజకీయ జగడం రాజుకుంటోందనే చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరు నాయకులు ఇప్పటికైనా వైరానికి, వ్యక్తిగత దూషణలకు పుల్‌స్టాప్‌ పెట్టకపోతే స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి..బీఆర్ఎస్ అధిష్టానం రాజయ్య, కడియం శ్రీహరి పంచాయితీకి ఎలా పుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story