BRS: బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు

BRS: బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు
టికెట్‌ వద్దంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన కడియం కావ్య... నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కడియం కావ్య

లోక్‌సభ ఎన్నికల ముంగిట ప్రతిపక్ష బీఅర్‌ఎస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్ పొంది వరంగల్ లోక్‌సభ స్ధానంలో పోటికి దిగిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి, భూ కబ్జా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణం తదితర అంశాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలోనూ స్ధానిక నాయకుల మధ్య సమన్వయం సహకారం లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం వల్ల పార్టీకి మరింత నష్టం చేకూరుతోందని కావ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని భావించి వైదొలుగుతున్నానని కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్నించాలని లేఖలో చెప్పారు.


అటు బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య.... ఇద్దరూ ఇవాళ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. వరంగల్ లోక్‌సభ స్ధానం నుంచి అధికార పార్టీ అభ్యర్ధిగా కడియం కావ్య పోటీ చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్‌ఎస్‌ను వీడతారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు పలువురు కడియంతో మంతనాలు జరిపి కావ్యకు టిక్కెట్ ఇప్పించేలా హామీ ఇచ్చారు. మొదటి నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తన కుమార్తె కావ్యను బరిలో నిలపాలని కడియం శ్రీహరి భావించినా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నుంచి గట్టి పోటేయే ఎదురైంది. దీంతో ఇష్టం లేకున్నా కడియం వెనక్కితగ్గారు. కానీ ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్లడంతో కడియం కావ్య అభ్యర్దిత్వం ఖరారైంది. మూడు రోజుల క్రితం కడియం కావ్య కేసీఆర్‌ను కలిసి వరంగల్ లోక్‌సభ నుంచి పోటే చేసే అవకాశం కల్పించినందుకు. కృతజ్ఞతలు కూడా చెప్పారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు.. కడియంను పునరాలోచనలో పడేశాయి. దీంతో పోటీ నుంచి కావ్య వైదొలిగారు. ఇద్దరూ ఇవాళ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు.

వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ధీటైన అభ్యర్ది కోసం చూస్తున్న కాంగ్రెస్ కడియం కావ్యను అభ్యర్ధిగా ఖరారు చేయనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి ఆ పార్టీ అధినాయకత్వానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు.. వరంగల్ ఎంపీగా పనిచేసిన పసునూరి దయాకర్ బీఆర్‌ఎస్‌ను వీడి హస్తం గూటికి చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సైతం.... బీఆర్‌ఎస్‌ను వీడారు. తాజాగా కడియం అదే బాటలో పయనిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story