KU: కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణ

కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది. ఉద్యోగుల బదిలీలు, నియామకాలు, బిల్లుల చెల్లింపుల్లో VC అక్రమాలకు పాల్పడ్డారని.. KU అధ్యాపకుల బృందం ఫిర్యాదు చేసింది. స్పందించిన సర్కార్.. శుక్రవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణతోనైనా అక్రమాలు వెలుగుచూస్తాయని.. వర్శిటీ పాలన గాడిన పడుతుందని పలువురు అధ్యాపకులు భావిస్తున్నారు..
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ కొంతకాలంగా మసకబారుతుందన్నది కాదనలేని సత్యం. ఇక్కడ అవినీతి అక్రమాలతో పాలన గాడితప్పుతోంది. ఉపకులపతిగా తాటికొండ రమేష్ నియామకం జరిగిన నాటి నుంచే.. ఆయనపై అనేక అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే VC అక్రమాలపై 'అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ' టీచర్ల సంఘం జనవరిలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వీటిని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం.. విచారణ నిమిత్తం డైరెక్టర్ జనరల్ విజిలెన్స్‌కు పంపారు. VC నియామకానికి 10ఏళ్ల ప్రొఫెసర్ అనుభవం తప్పనిసరి అని UGC నిబంధనలు చెప్తున్నా.. గత ప్రభుత్వం VCగా రమేశ్‌ని నియమించిందన్నారు. అర్హత లేని VC పాలన వల్ల అధ్యాపకులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఇబ్బందులుపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత కక్షలకు పాల్పడుతూ అక్రమంగా బదిలీలు, పాలన పదవులు, అక్రమ డిప్యూటేషన్లు చేశారని ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమౌతున్నా పట్టించుకోలేదని.. భూకబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని.. ఫిర్యాదులో టీచర్ల సంఘం తెలిపింది.
PHD ప్రవేశాలపై ప్రశ్నిస్తే.. విద్యార్ధులపైనే తప్పుడు కేసులు బనాయించారని.. అర్హతలు కలిగినవారికి ప్రమోషన్లు ఇవ్వలేదని సంఘం సభ్యులు చెబుతున్నారు. ఎన్నికల నియామావళి కూడా ఉల్లంఘించారని.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య.. అనిశా అధికారులకు చిక్కిన ఒక ఉదంతమే అక్రమాలకు నిదర్శనమని తెలిపారు. VC అక్రమాలపై KU పాలక మండలికి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
విజిలెన్స్ విచారణను ఆహ్వానిస్తున్నానని.. VC తాటికొండ రమేష్ తెలిపారు. KUవీసీగా పనిచేసిన మూడేళ్లలోనూ.. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి... వైస్ ఛాన్సలర్ గా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని KU అభివృద్ధికి కృషి చేశానని రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. తన పదవి కాలంలో ఒక్క పర్మినెంట్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదని.. విశ్వవిద్యాలయం భూమి ఒక్క గుంట కూడ అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగానని చెప్పారు. దొడ్డి దారిలో ప్రమోషన్ల పొందాలని చూసే వారు, వర్సిటీ అభివృద్ధిని ఓర్వలేక దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఫిర్యాదులు.. అక్రమ అడ్మిషన్లు కావాలని గగ్గోలు పెట్టే వారంతా చేసినవేనని ప్రకటనలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com