KALESHWARAM: ఎక్కడో లెక్క తప్పినట్లు ఉంది

బ్యారేజీల నిర్మాణాల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. లోపం ఎక్కడుంది ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామన్నారు. ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాళేశ్వం ప్రాజెక్టు బ్యారేజీలకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. బ్యారేజీల నిర్మాణాల విషయంలో నిజా నిజాలు నిగ్గుతేల్చడంపై దృష్టిసారించింది. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో న్యాయ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బాధ్యతలను పర్యవేక్షించిన ఇంజినీర్ల విచారణ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే మూడింటి సమాచారాన్ని తెలుసుకున్నామన్న ఆయన విచారణకు హాజరవుతున్న వారంతా ఈ నెల 25లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించామన్నారు.
బ్యారేజీల్లో చోటుచేసుకున్న సంఘటనలు, తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఇప్పటికే చెప్పామని ఎవరైనా తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమ, మంగళవారాల్లో ఇంజినీర్ల విచారణ జరిగిందని.. ఇక నిర్మాణ సంస్థల ప్రతినిధులను పిలుస్తాం’అని వెల్లడించారు. నిర్మించిన బ్యారేజీలు సరైన రీతిలో ఉంటే ప్రజలకు లాభమే తప్ప నష్టం ఉండదని.. జస్టిస్ పీసీ ఘోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఏవో తప్పుడు లెక్కలతోనే ఇలా జరిగినట్లు అనిపిస్తోందన్నారు. విచారణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తిస్తే వారికి కూడా నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇతరుల వద్ద ఏదైనా సమాచారముంటే అఫిడవిట్ రూపంలో సమర్పించవచ్చని ఆయన సూచించారు.
ఇక మంగళవారం విచారణకు 18 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు గతంలో ఆయా విభాగాల్లో పని చేసిన వారిని కూడా కమిషన్ పిలిచింది. నిర్మాణాలను ఏవిధంగా చేపట్టారు.. నమూనాలు, కట్టడాల విధానంతోపాటు ఆ సమయంలో గుర్తించిన లోపాలపై విచారణ సాగినట్లు తెలిసింది. ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన వివరాలతోపాటు తెలిసిన అంశాలపై కమిషన్ విచారణ చేసినట్లు సమాచారం. కమిషన్ ఇవాళ... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన గుత్తేదారు సంస్థల ప్రతినిధులను విచారించనుంది. ఎల్ అండ్ టీ, నవయుగ, అప్కాన్ సంస్థలకు చెందిన వారితోపాటు మొత్తం 20 మందిని విచారణకు పిలిచినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com