kaleshwaram project :మరో రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు..!

kaleshwaram project : సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డు సృష్టించింది. జయశంకర్ భూపలపల్లి జిల్లా కన్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్ వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసి రికార్డు నెలకొల్పింది. 2019 జూన్ 21 నుంచి ఈ నెల 20 వరకు.. 213 రోజుల పాటు మోటార్లు నడవగా.... మొత్తం... వంద టీఎంసీల నీటిని ఎత్తిపోశారు ఇంజనీరింగ్ అధికారులు. 2020 మార్చి వరకు 95 టీఎంసీలు కాగా.. తాజాగా ఈ నెల 16 నుంచి ప్రారంభం అయిన ఎత్తిపోతల ప్రక్రియ ఐదు రోజుల్లోనే 5. 45 టీఎంసీల నీటిని ఎత్తివేయడంతో.. వంద టీఎంసీలు దాటిపోయింది. దీంతో సెంచరీ పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది లక్ష్మీ పంపుహౌస్. ఇప్పటికీ లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి పది పంపులతో గ్రావిటీ కాలువ ద్వారా నీటిని అన్నారం వద్ద నున్న సరస్వతీ బ్యారేజీలోకి వదులుతున్నారు. ఈ బ్యారేజీ పూర్తి సామర్ద్యం 10.87 టీఎసీలు. ప్రస్తుతం నీటి మట్టం 9 టీఎంసీలు. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ నుంచి రెండు గేట్లు ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com