Karnataka Election Results 2023 :కర్ణాటకలో విజయం.. తెలంగాణలో ఉత్సాహం

Karnataka Election Results 2023 :కర్ణాటకలో విజయం.. తెలంగాణలో ఉత్సాహం
X

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో.. ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఉంటుందా? ఇదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి BRS నుంచి బయటికి వచ్చిన నేతలపై ఈ ఫలితాల ప్రభావం కొంత ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఫలితాలు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపాయంటోన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్ నుంచి ఎవరూ బయటకు వెళ్లబోరని, పైగా ఇతరులు పార్టీలోకి వస్తారంటున్నారు.

మరోవైపు... బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. ఎటువైపు వెళ్లాలా అనే ఆలోచనలో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఎటువైపు మొగ్గు చూపుతారన్న చర్చ మొదలైంది. వీరిని చేర్చుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తుండగా వీరిద్దరూ వాయిదా వేస్తూ వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంతో... తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే... బీజేపీ మాత్రం కర్ణాటక ఫలితాలతో తెలంగాణకు సంబంధం లేదంటోంది. BRSను తామే గట్టిగా ఎదుర్కోగలమంటున్నారు కమలనాథులు.

మరోవైపు....అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. పార్టీలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి తక్కువ సమయమే ఉంది. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్దం చేస్తోంది బీఆర్ఎస్. సీఎం కేసీఆర్‌ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరో మంత్రి హరీశ్‌రావు సైతం పర్యటిస్తున్నారు. అసలు కర్ణాటక ఫలితాలేవి.. తెలంగాణలో ఉండబోమంటున్నారు గులాబీనేతలు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామంటున్నారు.

Next Story