KAVITHA: కొత్త రాజకీయ వేదిక వస్తుంది: కవిత

తెలంగాణ ప్రజల కోసం కొత్త రాజకీయ వేదిక రానుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామని, సమస్యలపై పోరాడతామని చెప్పారు. రాజకీయాల్లో మార్చు తెచ్చే వేదికగా జాగృతి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పార్టీలోకి అందరూ రావాలని ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మహిళల హక్కుల కోసం తనను దీవించాలని కోరారు. ఆడబిడ్డలకు రోషం చూపిద్దామని పిలుపునిచ్చారు.
"వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా.."
తనది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత అన్నారు. "దేవుడు మీద.. నా ఇద్దరి బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా.. ఒక్య వ్యక్తిగా సభ నుంచి వెళ్లిపోతున్నా.. ఒక శక్తిగా తిరిగివస్తా. KCRపై కక్షతో BJP నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా BRS నాకు అండగా నిలవలేదు. KCRకు అవినీతి మరక అంటితే నేనే పోరాడా.. నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు. BRS నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా." అన్నారు.
బీఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయమే
ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. బీఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి నిర్మాణం వరకు అవినీతే జరిగిందన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. ఉరి వేసే ఖైదిని చివరి కోరిక అడుగుతారని.. అలా కూడా తనను అడగకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని భావోద్వేగానికి గురయ్యారు.
రాజీనామా ఆమోదించండి
తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారన్నారు. పార్టీ మౌత్ పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ప్రశ్నిస్తే మాజీ సీఎం కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు కక్షగట్టారని చెప్పారు. బీఆర్ఎస్లో మొదటి నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై కవిత వివరణ ఇచ్చారు. శాసనమండలిలో కవిత మాట్లాడుతూ… ‘నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా. తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చాను. బీఆర్ఎస్లో చేరిక ముందే జాగృతిని స్థాపించా. తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చా. 8 ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్లో మొదటి నుంచి నాపై ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తూ వచ్చాను. కలెక్టరేట్లు కట్టిన రెండు నెలలకే కూలాయి. అమర దీపం నిర్మాణంలో అవినీతి జరిగింది. నేను ప్రజల గురించి, సమస్యల గురించి చెప్పిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదు’ అని అన్నారు. భావోద్వేగాలు మధ్య రాజీనామా చేయడం సరైంది కాదని, రాజీనామా అంశంలో పునరాలోచన చేయండని ఎమ్మెల్సీ కవితకు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

