KAVITHA: ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, సొంత బావ ఫోన్ ను ఎవరైనా ట్యాప్ చేస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వార్త వినగానే కడుపులో దేవినట్లైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత బీఆర్ఎస్లో చాలా అవమానాలు జరిగాయన్నారు. అన్యాయం జరిగితే భరించేదాన్ని కానీ అవమానాన్ని భరించలేకే ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చానన్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అసంతృప్తిలో ఉన్నారని నేను బీఆర్ఎస్ ను వీడాక ఆ పార్టీ నేతలు నాకు టచ్ లోకి వచ్చారని చెప్పారు. జనంబాటలో పాత బీఆర్ఎస్ క్యాడర్ నాతో మాట్లాడుతున్నారని చెప్పారు.
"ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు"
కరీంనగర్ జిల్లా పరిధిలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని కవిత పేర్కొన్నారు. “సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం వంటి కీలక అంశాలు ఇంకా జనాల మధ్య లోతుగా చేరాల్సి ఉంది,” అని కవిత తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడడంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసిన ఆమె, ఆర్టీసీ విభాగంలో ఉన్న సమస్యలపై విప్లవాత్మక ఆలోచన అవసరమని సూచించారు. “సామాజిక తెలంగాణను సాకారం చేయడం మనందరి బాధ్యత,” అని అన్నారు. “తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మనం అందరం కృషి చేశాం. కానీ కరీంనగర్ జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలి,” అని వ్యాఖ్యానించారు. పంటనష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

