KAVITHA:తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి.!

KAVITHA:తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి.!
X
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ పేరు ఇదేనంటూ ప్రచారం

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలకలం కొనసాగుతోంది. తన తండ్రి, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ... బీఆర్‌ఎస్‌లో కాక రేపుతోంది. భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం స్పందన కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాలని కవిత భావిస్తున్నట్లు ఆమె సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా రెండు అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పార్టీలో తిరిగి తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే, కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీ, తాను ప్రస్తావించిన దయ్యాల సంగతి కూడా తేల్చాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

శంషాబాద్‌లోనే స్పష్టం..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నాని ప్రచారం జరుగుతోంది. అమెరికా పర్యటన ముగించుకొని నిన్న శంషాబాద్ వచ్చిన కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలెవరూ రాలేదు. కానీ భారత జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డిఫరెంట్ కలర్ తో కూడిన భారీ ఫెక్సీని వారు ప్రదర్శించారు. బ్లూ కలర్ లో సామాజిక న్యాయానికి సంకేతంగా ఈ ఫ్లెక్సీ ఉంది. అదే సమయంలో సామాజిక తెలంగాణ సారథిగా కవితను పేర్కొంటూ వందల సంఖ్యలో ఫ్లెక్సీలను కూడా ప్రదర్శించారు.

పార్టీ పేర్లు ఇవే

తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లాల్సివస్తే కొత్త పార్టీ పెట్టడం ఖాయమని కవిత సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు పేర్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి(టీబీఆర్‌ఎస్‌) పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా బీసీ ఎజెండాతో కవిత పనిచేస్తున్నారు. కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి.. తన ఇంట్లోనే వారి సాదక బాధకాలు తెలుసుకున్నారు. లేఖ లీకేజీపై కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాను చెబుతున్న దయ్యాలే వాటిని కావాలని బయటకు విడుదల చేసి ఉండాలని ఆమె భావిస్తున్నారు.

Tags

Next Story