KAVITHA: కవిత చేజారుతున్నతెలంగాణ జాగృతి..!

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ రాజకీయం.. అనూహ్య మలుపులు తిరుగుతోంది. హరీశ్‌రావుపై కవిత సంచలన విమర్శలు.. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ వంటి అనూహ్య పరిణామాలతో ఇప్పుడు తెలంగాణలో అందరి దృష్టి కల్వకుంట్ల కుటుంబంపై కేంద్రీకృతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కవిత పట్ల మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్… తాజాగా ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె నుంచి లాగేసుకునే యత్నాలకు పదును పెట్టారన్న వాదన వినిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తొలి అడుగు కూడా పడిందని... జాగృతి ఏర్పాటు సందర్భంగా కవితతో పాటు కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలను కేటీఆర్ రంగంలోకి దించారు. కేటీఆర్ రంగంలోకి దింపిన నేతల్లో రాజీవ్ సాగర్, రాజారాం యాదవ్, మఠం బిక్షపతి ఇప్పటికే కవితకు వ్యతిరేకంగా గళమెత్తారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తమను నడిరోడ్డుపై పడేసిందని కొందరు జాగృతి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఎవరిని అడిగి కవిత ఈ నిర్ణయం తీసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. జాగృతి ఆవిర్భావంలో కవితతో కలిసి సాగామని, సంస్థలో కవితకు ఎంత పాత్ర ఉందో తమకూ అంతే పాత్ర ఉందని ఈ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఈ నాయకుల వెనుక కేటీఆర్ ఉన్నాడని... ఆయనే వీరితో మాట్లాడిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఏకాకిగా మారిన కవిత
కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఏకాకిగా మిగిలినట్లు కనిపిస్తోంది. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు బజార్న పడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తన అన్నే లేఖను లీక్ చేశారని ఆమె అనుమానిస్తున్నారు. కేటీఆర్, తనకు మధ్య గ్యాప్ ఉందనే రీతిలో గతంలో కవిత వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా చేశారనే భావనతో ఆమె ఉన్నారనే ప్రచారం గట్టిగా సాగింది. అది నిజమేననిపించేలా కవిత కూడా స్వంతంగా జాగృతి ద్వారా కార్యకలాపాలు సాగించారు. ఈ సమయంలో పార్టీ వైపు నుంచి కానీ, కుటుంబం వైపు నుంచి కూడా ఆమెకు పెద్దగా మద్దతు లభించలేదు. కవితకు మాజీ మంత్రి హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అబద్ధపు ప్రచారమని ఆయన కవితను దృష్టిలో పెట్టుకుని సమాధానం ఇచ్చారు. అలాగే కావాలనే కొందరు బీఆర్ఎస్ విలీనం అవుతుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవితకు పరోక్షంగా చురకలు అంటించారు. కేసీఆర్ కుటుంబంతో తండ్రి మొదలుకుని, ఇతర కుటుంబ సభ్యులెవరూ కవితకు మద్దతుగా లేరనేందుకు హరీష్‌రావు కౌంటరే నిదర్శనం. కేసీఆర్‌కు హరీష్‌రావు, సంతోష్‌రావు అత్యంత నమ్మకస్తులని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. కవిత ధిక్కార ధోరణిపై కుటుంబ సభ్యులంతా ఒకే మాటపై ఉన్నారని అంటున్నారు. అందుకే కవిత బీఆర్ఎస్లో ఒంటరిగా మిగిలారని, ఈ ఒత్తిడిలో రానున్న రోజుల్లో ఆమె మరిన్ని సంచలనాలకు కేంద్రం కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com