KAVITHA: నాపై కక్ష కట్టారు.. నన్ను వేధిస్తున్నారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను తొలగించి.. ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా నియమించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై స్పందించిన కల్వకుంట్ల కవిత.. సింగరేణి కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. తనను గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కవిత ఆరోపించారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించారని, సాంకేతికంగా ఇది తప్పు అని పేర్కొన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్ల పాటు కార్మికులకు సేవలు అందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. అదే సమయంలో కొత్తగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వాములను చేయడంలో తాను ముందుండి పని చేశానని కవిత గుర్తు చేసుకున్నారు.
నాపై కక్ష కట్టారు
పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను తాను ప్రశ్నించడం వల్లే తనపై కక్షగట్టారని కవిత పేర్కొన్నారు. కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ చేసిన కుట్రదారులు ఎవరో బయటపెట్టాలని తాను కోరినందుకు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నా లేకపోయినా.. కార్మికుల కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని కవిత హామీ ఇచ్చారు. తన పదవీకాలంలో కార్మికుల కోసం చేసిన కృషిని కవిత వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిలిపివేసిన డిపెండెంట్ ఉద్యోగాలను కేసీఆర్‌ను ఒప్పించి తిరిగి కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించానని తెలిపారు. తద్వారా 19,463 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించానని చెప్పారు. కార్పొరేట్ వైద్య సదుపాయాలు వంటి అనేక పథకాలను అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశానని ఆమె వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com