KCR: కాంగ్రెస్‌ వస్తే భూ మాత కాదు భూ మేతే

KCR: కాంగ్రెస్‌ వస్తే భూ మాత కాదు భూ మేతే
కేసీఆర్‌ విమర్శలు...ఆటో కార్మికులకు శుభవార్త చెప్పిన కేసీఆర్‌

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికులకు ఫిట్ నెస్ ఛార్జీ, సర్టీఫికెట్ జారీకి అయ్యే ఖర్చు రద్దు చేస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగామానకొండూరు, స్టేషన్ ఘనపూర్ , నకిరేకల్ , నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీలు, ఆకలి చావులు, జైలు కష్టాలేనని విమర్శించారు. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ అంధకారమేనని ఉద్ఘాటించారు. 50ఏళ్ల పాలనలో హస్తం పార్టీ చేసిందేం లేదని అసలు కాంగ్రెస్ పరిపాలన బాగుంటే NTR తెలుగుదేశం పార్టీ పెట్టే అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు. కాబట్టి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడ చూసిన కరవు ఉండేదని రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా ఉండేవన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరవు లేదు, కర్ఫ్యూ లేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు వేయగానే అయిపోదని, అక్కడి నుంచే కథ మొదలవుతుందని తెలిపారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు, ఇళ్లు లేని లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో భూమాతను ప్రకటించారని, అది భూమేతేనని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ధరణిని ఎత్తేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని తెలిపారు. రైతు రుణామాఫీ కాంగ్రెస్‌ నేతలవల్ల ఆగిపోయిందని ప్రభుత్వం రాగానే మిగిలిపోయిన వారికి కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని, కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాశక్తి ముందు ఎవరూ నిలువరని స్పష్టం చేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపి, భూమాత తెస్తామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్‌ వస్తే జరిగేది భూమాతనా? భూ‘మేత’నా?అని ప్రశ్నించారు. ధరణిని బంద్‌ చేస్తే రైతు బంధు నిధులు ఎలా వస్తాయన్నారు.


మరోవైపుు యాదగిరిగుట్ట గురించి యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్ట, వలిగొండ, మిర్యాలగూడలో రోడ్ షో నిర్వహించిన KTR కొండపైకి ఆటోలు వెళ్లేలా ఆటో డ్రైవర్లకు డిసెంబర్ 3 తర్వాత శుభవార్త చెప్తామని తెలిపారు.కాంగ్రెస్ నేతలు ఒక్కఛాన్స్ అంటున్నారని, 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడం అంటే పదేళ్ల కిందటి కష్టాలు తెచ్చుకోవడమే అని తెలిపారు. భారాస పాలనలో తాగు, సాగునీటి కష్టాలు లేవని ప్రజలు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story