KCR: సారొస్తారా..? సవాల్‌కు సై అంటారా..?

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాగ్వాదాల వేడి పెరిగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ఉధృతమవుతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు... ముఖ్యమంత్రి రేవంత్ ఘాటుగా స్పందించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అభివృద్ధి, పాలన, గత–ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తుండగా, వాటికి రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. సభలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ మాటల యుద్ధం కేవలం నేతల మధ్య పరస్పర విమర్శలకే పరిమితం కాకుండా, రాబోయే రాజకీయ సమీకరణలకు సంకేతంగా మారుతోంది. అధికార–ప్రతిపక్షాల మధ్య ఈ ఘర్షణ తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
రేవంత్ శపథం
“ప్రజల్లోకి వస్తాం, ప్రభుత్వం తోలు తీస్తాం” అని కేసీఆర్, “నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే నా శపథం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపధ్యంలో సహజంగా తలెత్తుతున్న ప్రశ్న: కేసీఆర్ నిజంగానే ప్రజల్లోకి వచ్చి రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తారా? లేక వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తారా? అన్న ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది. చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన మాజీ కేసీఆర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్ ప్రకటించారు. రెండేళ్లు ఆగాం. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తా.. తోలు తీస్తామన్నారు. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు. ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబం కాలకూట విషం. కేసీఆర్, బీఆర్ఎస్ చరిత్ర ఖతమే. ఇక గతమే. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. 2029లో రెండింట్ల మూడొంతల మెజార్టీతోని కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఇదే నా సవాల్ అంటూ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వనంటూ శపథం పూనారు.
మారిన రాజకీయ సమీకరణలు
బీఆర్ఎస్ పదేళ్ళ పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారాయి. రేవంత్ రెడ్డి తన సహజ రాజకీయ శైలిలో బీఆర్ఎస్, కేసీఆర్ పై దూకుడు, వాగ్దాడిని ప్రధానాస్త్రాలుగా సంధిస్తున్నారు. కేసీఆర్ పై కుటుంబం పాలన, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ, కేసీఆర్.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత దాదాపు మౌనంగా ఉంటున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఎంపిక చేసుకున్న అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. మాట్లాడుతున్నారు. అయితే ఈ మౌనం బలహీనతా? రాజకీయ వ్యూహమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేవంత్ రెడ్డి సవాళ్ల వెనుక మాత్రం స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. గత పాలనను నిరంతరం ప్రశ్నించడం ద్వారా ప్రజా అజెండాను నియంత్రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులకు, ప్రభుత్వానికి నైతిక బలం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను ఆత్మ రక్షణలోకి నెడుతున్నారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ రాజకీయ వర్తమానాన్ని, భవిష్యత్తును నియంత్రిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించకపోతే ‘భయపడుతున్నట్లు’, స్పందిస్తే కాంగ్రెస్ చెప్పే ఆరోపణల చర్చ మరింత విస్తరించే వ్యూహాన్ని సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అపర రాజకీయ నిపుణడిగా పేరున్న కేసీఆర్, ఈ రెండింటి మధ్య చిక్కుకున్నారా? అనే విశ్లేషణలు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

