KCR: మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 19 జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో.. కృష్ణా, గోదావరి జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, రాబోయే ప్రజా ఉద్యమాలపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల నీటి హక్కులపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోన్న తరుణంలో ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారా.. లేక ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతారా అనే విషయంపై స్పష్టత లేదు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు నుంచి ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కొంత కాలం తర్వాత ఇలాంటి పార్టీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు.
ఇక మారనున్న కారు గేరు
కేసీఆర్ గత కొంతకాలంగా పార్టీ ముఖ్య నాయకులకు అందుబాటులో ఉండటంతో పాటు.. నియోజకవర్గాల వారీగా తనను కలిసేందుకు వచ్చిన కొందరు నేతలతో సమావేశమవుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ‘‘కారు’’ గేర్ మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారని.. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్లొ ఈ నెల 19న బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశం ఏర్పాటు చేసిందని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘ఏపీ గోదావరి కృష్ణ జలాలను కొల్లగొడుతున్నా కూడా, దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి సందర్భంలో.. తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావిస్తున్నాం. ఇందులో భాగంగాతదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి భేటీలో లోతుగా చర్చ జరగనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలు కేటాయించడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది.
రంగంలోకి కేసీఆర్..
కాగా, [భారత్ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (బీఆర్ఎస్ఎల్పీ) సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యచరణపై చర్చిస్తారు. అంతేకాకుండా రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రైతుల నీటి హక్కులపై మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పేరును నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌గా మార్చి ఏపీ ప్రభుత్వం మళ్లీ అదే పని చేస్తోందని మంత్రి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదు. ఇంకా చెప్పాలంటే.. బీజేపీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరి నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గాని ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు’’ అని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

