KCR : కేంద్రంపై కేసీఆర్ సరికొత్త అస్త్రం..

KCR : కేంద్రంపై కేసీఆర్ సరికొత్త అస్త్రం..
KCR : తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా కేంద్ర బీజేపీ పెద్దలతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలను ఇరుకున పెట్టేశారు గులాబీ అధినేత

KCR : అవును.. సెప్టెంబర్ 17 తెలంగాణ కాక రేపుతున్న వేళ.. కేంద్ర బీజేపీపై సీఎం కేసీఆర్ అంబేద్కర్ అస్త్రాన్ని సంధించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా కేంద్ర బీజేపీ పెద్దలతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలను ఇరుకున పెట్టేశారు గులాబీ అధినేత. అంతేకాదు.. పార్లమెంట్‌కూ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్‌తో కేంద్రంపై గట్టిగా పోరాడాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. దీనికితోడు ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులను వేగంగా పూర్తి చేయిస్తున్న సీఎం కేసీఆర్.. దళిత సంఘాలు, దళిత మేధావుల్లో మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

అంబేద్కర్ పేరును సచివాలయంకు పెట్టాలని డిసైడ్ అయిన కేసీఆర్... కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని దేశం గుర్తించేలా కొత్తగా నిర్మించే పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీలో బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు అంబేద్కర్‌కు జై కొట్టేలా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఇక అంబేద్కర్ నామాన్ని టీఆర్ఎస్ పార్టీ మరింతగా ప్రజల్లోకి తీసుకోవాలని డిసైడ్ అయింది.

మరోవైపు.. జాతీయ సమైక్యత దినోత్సవాల పేరుతో మూడు రోజులపాటు జరిగే ప్రత్యేక ఉత్సవాలతో పాటు ఏడాది పొడవునా చేపట్టబోయే కార్యక్రమాలలో కూడా అంబేద్కర్‌ను ప్రధాన అంశంగా తీసుకోనుంది టీఆర్ఎస్ సర్కారు. రాష్ట్ర బీజేపీని ఇరుకున పెట్టేలా.. అంబేద్కర్ పట్ల కమలం పార్టీ వైఖరిపై నిలదీసేలా టీఆర్ఎస్ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో అడుగడుగునా అంబేద్కర్ అంశాన్ని తీసుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ శ్రేణులు. మొత్తానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి జాతీయస్థాయిలో సరికొత్త చర్చ తెరలేపారు.

Tags

Read MoreRead Less
Next Story