KCR Delhi Tour : ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్..

KCR Delhi Tour : ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్..
KCR Delhi Tour : సీఎం కేసీఆర్.. ఢిల్లీ నుంచి వచ్చేశారు.

KCR Delhi Tour : సీఎం కేసీఆర్.. ఢిల్లీ నుంచి వచ్చేశారు. వారం రోజులు హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్ ఎట్టకేలకు హైదరాబాద్‌కు వచ్చేశారు. రాష్ట్రపతిని కలుస్తారనే ఊహాగానాలు, కేంద్రమంత్రులతో భేటీ అవుతారనే ప్రచారాలు.. జాతీయ రాజకీయాల కోసమే అంటూ పుకార్లు.. కానీ ఇవేమీ కనిపించకుండానే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌ ముగిసింది.

ఈ నెల 25న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్... ఇవాళ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరదలపై ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చిన కేసీఆర్.. సాయంపై కేంద్ర మంత్రులతోను, వీలైతే ప్రధాని మోదీని కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటి భేటీలేమి కనిపించలేదు.

నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం కలిసి శుభాకాంక్షలు చెప్తారని ప్రచారం జరిగింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రపతిభవన్‌ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నించారా లేదా అన్నది కూడా తెలియడం లేదు.

మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం మీద ఇతర పార్టీల నేతలతో చర్చించేందుకు కేసీఆర్ ఢిల్లీ యాత్ర చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ కేవలం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో మాత్రమే సమావేశమైయ్యారు కేసీఆర్. ప్రాంతీయ పార్టీలు కలిసి కేంద్రంపై ఉమ్మడి పోరు చేయాలని అఖిలేష్ తో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్.

మరి ఇవేమి కానప్పుడు సీఎం కేసీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. వారం రోజులు అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చింది. ఇలా ఎన్నో ప్రశ్నలు తెలంగాణ అంతటా వినిపిస్తున్నాయి. ఢిల్లీ టూర్‌ పై ఎంత ఆసక్తి ఉందో అంతకంటే ఎక్కువ అనుమానాలకు తావిస్తోంది. విపక్షాలు మాత్రం కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై హాట్ హాట్ కామెంట్స్ విసురుతున్నాయి. హైదరాబాద్‌లో వరదలు పోటెత్తాయి. మూసీ పరివాహాక ప్రాంతాలు భయంగుప్పిట్లోకి జారుకున్నాయి.

ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఢిల్లీలోనే ఉండిపోయారు. ఇటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కాలుకు గాయం కావడంతో ప్రగతిభవన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదే విపక్షాలకు అసలు అస్త్రమైంది. వరదల సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని నిలదీశారు.

అప్పులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు సీఎం కేసీఆర్. కేంద్రం తీరుపై పోరాడేందుకు ఆర్థికంగా నిపుణులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నిర్మించుకుంటున్న సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక సాయం అందించని కేంద్రం.. రుణాలపైనా ఆంక్షలు విధిస్తోందని టీఆర్ఎస్ అధినేత భావన.

రుణాలు, రుణాలపై వడ్డీలను రాష్ట్రమే చెల్లిస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే లక్ష్యంతో ఎన్నడూ లేనివిధంగా త్రైపాక్షిక ఒప్పందాలంటూ కొత్త నిబంధనలు తెచ్చి ఆర్థిక కట్టడి చేస్తోందని కేసీఆర్.. ఆర్ధిక, న్యాయ నిపుణులతో చర్చలు జరిపారని తెలుస్తోంది.

ఏదీ ఏమైనా వారం రోజుల ఢిల్లీ పర్యటనలో పెద్దగా డెవలప్మెంట్స్ ఏమీ లేకపోయినా.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సీఎం కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Tags

Next Story