KCR Bihar : బీజేపీ ముక్త్‌ భారత్ దిశగా ఉద్యమించాలి : కేసీఆర్

KCR Bihar : బీజేపీ ముక్త్‌ భారత్ దిశగా ఉద్యమించాలి : కేసీఆర్
KCR Bihar : బిహార్‌లో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

KCR Bihar : బిహార్‌లో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశాన్ని సర్వం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోడీ ఏం చేశారని నిలదీశారు. బీజేపీ యేతర రాష్ట్రాలను టార్కెట్ చేసి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనతో దేశంలో ఏ వర్గం సంతృప్తిగా లేదన్నారు. రూపాయి విలువ పడిపోయిందన్నారు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు అల్లాడిపోతున్నారని ఆరోపించారు సీఎం కేసీఆర్.

మోడీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందని విరుచుకుపడ్డారు సీఎ కేసీఆర్. అపారమైన జలవనరులున్నా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తప్పడం లేదన్నారు. బీజేపీతో ఈ దేశానికి ప్రమాదముందన్న కేసీఆర్.. ఎనిమిదేళ్ల మోదీ సర్కార్‌ చేసిందేమీ లేదన్నారు. సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

విపక్షలన్నీ శక్తి కూడదీసుకుని బీజేపీ ముక్త్‌ భారత్ దిశగా ఉద్యమించాలన్నారు సీఎం కేసీఆర్. విద్వేశాలను రెచ్చగొడుతున్న బీజేపీని గద్దె దించేందుకు పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావాలన్నారు. అభివృద్ధికి పాతర వేసి, కేవలం నినాదాలకే పరిమితం అవుతున్న బీజేపీని దేశంలోనే లేకుండా చేయాలన్నారు. పోర్టులు, రైల్వేలను అమ్మేస్తే ఇక దేశానికి ఏం మిగులుందని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే సీఎంలు ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర పరిణామాణం చోటుచేసుకుంది. ప్రధాని అభ్యర్థిగా నితీష్‌ కుమార్‌ను ఒప్పుకుంటారా అని ఓ రిపోర్ట్ర్ ప్రశ్నించగానే.. నితీష్‌ కుమార్ ధన్యవాదాలు చెప్పి నిలబడ్డారు. కేసీఆర్‌ కల్పించుకుని నితీష్‌ను కూర్చోవాలని పదే పదే రిక్వెస్ట్ చేశారు.

మరోవైపు ప్రెస్‌మీట్‌లో కేంద్రంపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కానీ కేసీఆర్‌ టూర్‌లో నితీష్‌ కుమార్ బీజేపీని పలెత్తుమాట కూడా అనలేదు. దీంతో కేసీఆర్ వెంట అడుగులు వేసేందుకు నితీష్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక అంతకుముందు గాల్వాన్‌లోయలో చనిపోయిన బిహార్‌కు చెందిన అమరజవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసింది. బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్‌లు అందజేశారు. మొత్తం 5 మంది సైనిక కుటుంబాలకు పదిలక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన బిహార్ కార్మికుల కుటుంబాలకు కూడా సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. 12 మంది కార్మిక కుటుంబాలకు 5లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.

గాల్వాన్‌లో సైనికుల త్యాగం ఎంతో గొప్పదని సీఎం కేసీఆర్ కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్ కార్మికుల పాత్ర కూడా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా సమయంలో చాలా మంది బీహార్‌ కార్మికులు తెలంగాణలో ఉండిపోయారని.. వారిని ప్రత్యేక రైళ్లల్లో తరలించామన్నారు.

ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనను బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొనియాడారు. కేసీఆర్ అమలు చేసే పథకాలు మంచి ప్రయోజనాలు ఇస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ పథకం ఎంతో గొప్ప ఆలోచన అన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలించడానికి తమ రాష్ట్ర బృందాన్ని పంపిస్తామన్నారు. బిహార్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు అభినందనీయమని కొనియాడారు.

మొత్తానికి సీఎం కేసీఆర్ బిహార్ టూర్ దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎంను కొనియాడిన బిహార్ ముఖ్యమంత్రి.. మరి కేసీఆర్‌తో కలిసి నడుస్తారా లేరా అన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story