KCR Wanaparthy Tour: వనపర్తిలోని బహిరంగ సభలో బీజేపీపై కేసీఆర్ ఫైర్..

KCR Wanaparthy Tour: వనపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్యాలలో నిర్మించిన అధునాతన వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించారు. అలాగే బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు – మన బడి పైలాన్‌ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు.
5 వందల కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనం, 50 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీకి, 76 కోట్లతో నిర్మించనున్న కర్నెతాండ లిప్టు పనులకు శంకుస్థాపన చేశారు. నాగవరం శివారులో 50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వనపర్తి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసి రాష్ట్రమంతా ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు.
వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో బుధవారం నిరుద్యోగ సోదరుల కోసం కీలక ప్రకటన చేయబోతున్నానని, తెలంగాణను ఎలా ఆవిష్కరించుకున్నామో చెబుతానని, ఉదయం పది గంటలకు అందరూ టీవీలు చూడాలని కోరారు. బీజేపీ టార్గెట్‌గా సీఏం కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు.
దేశాన్ని ఆగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలకు మతపిచ్చి, కుల పిచ్చి లేపి రాజకీయాలను మంటగలుపుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎలా కొట్లాడామో.. దేశం కోసం అలాంటి పోరుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, గతంలో ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో ఇపుడు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు సీఎం కేసీఆర్.
పాలమూరు నుంచి ఒకప్పుడు ఇతర ప్రాంతాలకు వలసలు వుండేవని.. తమ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులతో జలధార పొంగిపొర్లుతోందని, ఇపుడు తెలంగాణలో పనుల కోసం 11 రాష్ట్రాల వారు వలసలు వస్తున్నారని చెప్పారు. వనపర్తి వేదికగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్లు వెల్లడించడం హాట్ టాఫిక్ గా మారింది. ఇంతకీ అసెంబ్లీలో కేసీఆర్ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? నోటిఫికేషన్లపై క్లారిటీ ఇస్తారా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? అన్నది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com