KCR: యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు.. కేంద్రం తీరుతో..!: కేసీఆర్

KCR (tv5news.in)
KCR: కేంద్రంపై మరోసారి కన్నెర్రజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రం తీరును ఎండగట్టారు. రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని నమ్ముకుంటే సర్వనాశనం కావ్వాల్సిందేనన్నారు. రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ, రాబందు పార్టీ అంటూ నిప్పులు చెరిగారు.
దుష్ట పాలనతో దేశంలో ఆకలి కేకలు పెరిగాయని.. సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకూ చురకలంటించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ కొనబోని కేంద్రం చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్ నిల్వ చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఆ సామాజిక బాధ్యతను విస్మరించి ధాన్యాన్ని కొనలేమని చెబుతోందని.. ధాన్యం సేకరణ విషయంలో పెద్ద రాద్ధాంతం సృష్టించి దేశంలోని రైతులందరికీ గందరగోళానికి గురి చేస్తోందని మండిపడ్డారు. 90లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కోరామని.. ఢిల్లీకి వెళ్తే తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు.
ఇలాంటి నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదన్నారు. విభజన చట్టం ప్రకారం సహకారం అందివ్వడంలేదని విమర్శించారు. రైతులు, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు కేసీఆర్. రైతుల మెడ మీద కత్తిపెట్టి ప్రతి బోరుకు మీటర్ పెట్టాలని చూస్తోందన్నారు.
16 గంటలే విద్యుత్ వాడుకోవాలని చెప్పడం సంస్కరణలు అవుతాయా అని ప్రశ్నించారు. రైతుల పోరాటం, యూపీ ఎన్నికలు చూసి సాగు చట్టాలు రద్దు చేశారని విమర్శించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను ఇస్తుంటే దాన్ని నాశనం చేయాలని కేంద్రం చూస్తోందన్నారు. 80 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారన్నారని ప్రశ్నించారు.
రెండేళ్లుగా దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిందని.. ఈ ఏడేళ్లలో బీజేపీ చేసిన సంక్షేమం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉండి కూడా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు సీఎం కేసీఆర్. దమ్ముంటే కేంద్రంతో ధాన్యాన్ని కొనిపించాలని సవాల్ విసిరారు. ఎట్లైనా సరే కొనిపిస్తానంటే కిషన్‌రెడ్డి సిపాయేనన్నారు.
తెలంగాణకు కొనాలని చెప్పే కేంద్రమంత్రి కావాలని.. ఆయన చేతకాని దద్దమ్మంటూ ఫైరయ్యారు. ఈ వర్షాకాలం పంటను పూర్తిగా కొంటామని.. కేంద్రం తమ దగ్గర కొనకపోతే బీజేపీ ఆఫీస్ ముందు, ప్రధాని ఇంటి ముందు పోస్తామన్నారు. వెయ్యి లారీలు పెట్టి తీసుకొని పోయి ఢిల్లీ ఇండియా గేట్ వద్ద పోస్తామని హెచ్చరించారు. 750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ, రాబందు పార్టీ అంటూ కేంద్రంపై భగ్గుమన్నారు.
చమురు ధరలు తగ్గిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు కేసీఆర్. ఇదంతా పక్కన పెట్టి రాష్ట్రం వ్యాట్ తగ్గించాలని మళ్లీ వాళ్లే ధర్నాలు చేస్తారన్నారు. ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం.. 116 దేశాల్లో సర్వే చేస్తే భారత్ 101వ స్థానంలో ఉందని.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పోల్చితే హీన స్థితిలో ఉన్నామన్నారు.
కేంద్రం వద్ద నిల్వలు ఎక్కువ అయ్యాయి అని చెబుతున్నారని.. ఎక్కువైతే ఎందుకు భారత్ ఆకలి సూచిలో వెనుకబడి ఉందని నిలదీశారు. కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే ధాన్యాన్ని సేకరించి ఆకలితో ఉన్న బిడ్డలకు పంచిపెట్టాలన్నారు. కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు సీఎం కేసీఆర్.
ఏపీ ఇబ్బందులు పెట్టినా.. కొందరు కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించామని వెల్లడించారు. తమ కృషి వల్ల తెలంగాణలో పంటలు దిగుబడి పెరిగిందని.. గతంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగిందన్నారు. తమ హయాంలో 69.3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. కేంద్రం తెలంగాణ రైతులను వందశాతం ముంచుతుందని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com