KCR: కాంగ్రెస్ సర్కార్ బదనాం అవుతోంది
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనతికాలంలోనే బదనాం అవుతోందని సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని బీఅర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసమే గులాబీ జెండా పుట్టిందని, చివరి శ్వాస వరకు..... తెలంగాణ కోసమే పనిచేస్తాం తప్ప విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీని గెలిచామని, మరో ఎమ్మెల్సీని గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచిఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్న కేసీఆర్... ఎన్ని వచ్చినా ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉద్యమసమయంలోఅసువులు బాసిన అమరులకు అంజలి ఘటించిన అనంతరం... పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను ఉద్దేశించి భారాస అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు, ఆది నుంచి జరిగిన ఉద్యమ ప్రస్థానం, జరిగిన పరిమాణాలను కూలంకషంగా వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ మొండి వేషాలు, చర్యలు చూస్తే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. అనుకోకుండా వచ్చిన గెలుపుపై వారికి నమ్మకం లేదని KCR అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత...... కొంత నైరాశ్యం ఉందని, మళ్లీ తాను బస్సు ఎక్కితే అదే జోరు ఉందని కేసీఆర్ వివరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్‌ఎస్ అని.... ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన తప్పులను తామే సరిదిద్దాలని..... అందుకు దశాబ్ది స్ఫూర్తి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. విత్తనాల కోసం రైతులను కష్టాలపాలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వ లోగో అనేది ప్రజల గుండెపై ఉంటుందని... నిపుణులతో మాట్లాడే అన్నీ చేసినట్లు కేసీఆర్ వివరించారు. చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పనిచేస్తాం తప్ప విశ్రమించే ప్రసక్తే లేదన్న గులాబీ దళపతి... తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ వారి కోసమే పని చేస్తుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com