జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..ప్రాజెక్టులకు శంకుస్థాపన

జిల్లాల పర్యటనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. వరుస టూర్లు చేస్తున్న సీఎం కేసీఆర్.. ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షిస్తుండగా.. భారీగా జనసమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1658 కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మందమర్రి మండలంలో సుమారు 500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మంచిర్యాల ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నమంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరి నదిపై 164 కోట్లతో నిర్మించే బ్రిడ్జి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం... కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com