KCR: బీజేపీ ముక్త్ భారత్ పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్.. రాష్ట్రాల పర్యటనకు సిద్ధం..

KCR: బీజేపీపై దండయాత్రకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒక జాతీయ పార్టీని నిలువరించడానికి ప్రాంతీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే, బీజేపీ ముక్త్ భారత్ నినాదాన్ని వినిపించారు సీఎం కేసీఆర్. బీజేపీని ఓడించడం కాదు.. దేశం నుంచి తరిమేయాలి అంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి, మిగిలిన పార్టీలను దేశం నుంచి వెళ్లగొట్టాలంటూ స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ నినాదాన్ని రివర్స్ చేస్తూ.. బీజేపీ లేని దేశం కావాలంటూ నినాదం ఎత్తుకున్నారు సీఎం కేసీఆర్.
బీజేపీ ముక్త్ భారత్ నినాదం చెప్పకపోయినా.. పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం ఇదే ప్లాన్‌తో ఉన్నాయి. వీరిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇప్పటికే బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈమధ్య బీజేపీపై కదం తొక్కుతున్నారు సీఎం కేసీఆర్. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘం నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. రైతు సంఘాల నేతలు.. తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని పెద్దపల్లి బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
కలెక్టర్ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్కడికి వెళ్లినా బీజేపీనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కేవలం రాజకీయ ఆరోపణలతో సరిపెట్టకుండా.. లెక్కలు, ఉదాహరణలతో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. బీజేపీ కారణంగానే మత ఘర్షణలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. బీజేపీని గాని నమ్మితే పథకాలు ఆగిపోతాయని చెబుతున్నారు. గుజరాత్ మోడల్ డెవలప్‌మెంట్ పేరుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు రూపాయి మారక విలువపై మాట్లాడిన నరేంద్ర మోదీ.. ప్రధాని అయ్యాక రూపాయి పతనం అవుతున్నా చూస్తూ ఉండిపోతూ దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు.
పింఛన్లు, రైతుబంధు వంటి పథకాలు ఇస్తుంటే.. ఉచితాలు ఎందుకంటూ బీజేపీ మొత్తకుంటోందంటూ విమర్శించారు. పేదలకు సంక్షేమం వద్దు గానీ.. 12 లక్షల కోట్ల రూపాయలు ఎన్‌పీఏల పేరిట కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇలా బీజేపీపై విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. మరోసారి రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపు బీహార్ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో ప్రకటించిన విధంగా గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీంతో పాటు ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ భేటీలో ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం బీజేపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. పాలు, పెరుగు, చివరికి గుజరాతీ డ్యాన్సులపైనా జీఎస్టీ విధించి పేదలను మరింత పేదలుగా మారుస్తున్నారని విమర్శించారు. జీఎస్టీ ద్వారా వచ్చిన లక్షల కోట్ల పన్ను సొమ్ముతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొడుతున్నారని ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక్కో ఎమ్మెల్యేను 20 కోట్లకు కొనేందుకు బీజేపీ ప్లాన్ చేసిందన్నారు. మొత్తం 40 మంది ఎమ్మెల్యేలను కొని ఆప్ సర్కార్‌ను కూలదోచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఎన్సీపీ నేతలపై ఈడీని ప్రయోగించడాన్ని తప్పుపడుతున్నారఉ. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. దీంతో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. మొత్తంగా బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు భారీ కసరత్తే చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com