తెలంగాణ

KCR: జాతీయస్థాయిలో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేయబోతున్న కేసీఆర్..?

KCR: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ వ్యూహం మారిందా? కొత్త ఫ్రంట్లు, పార్టీలను కలుపుకొని వెళ్లడం ఇక చెక్‌ పడినట్లేనా?

KCR: జాతీయస్థాయిలో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేయబోతున్న కేసీఆర్..?
X

KCR: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ వ్యూహం మారిందా? కొత్త ఫ్రంట్లు, పార్టీలను కలుపుకొని వెళ్లడం ఇక చెక్‌ పడినట్లేనా? తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేయబోతున్నారా? ప్లీనరీలో కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సరికొత్త మార్పును తెలంగాణ నుంచే తీసుకురావాలన్న రీతిలో మాట్లాడారు.

తెలంగాణలోనే కొత్త జాతీయ పార్టీ పుట్టుకొస్తే అది అందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నట్టే.. జాతీయ స్థాయిలో భారతీయ రాష్ట్ర సమితి పెట్టాలని చాలా మంది సలహా ఇస్తున్నారంటూ మాట్లాడారు. ఇందులో భాగంగానే.. దేశానికి కావాల్సింది కొత్త రాజకీయ ఫ్రంట్‌లో, రాజకీయ పునరేకీకరణో, ఎవెవరినో ప్రధానిని చేయడమో కాదంటూ కుండబద్దలు కొట్టారు.

దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా అంటూ చెప్పుకొచ్చారు. అది ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలంటూ మాట్లాడారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయాలు, దేశ ఆర్థిక స్థితిగతులపై పెద్ద ప్రసంగమే చేశారు కేసీఆర్. ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం, వసతులు, వనరులు భారతదేశానికి ఉన్నా.. వాటిని వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు కేంద్రంలో పాలించే పాలకులకు లేకుండా పోయాయని కామెంట్ చేశారు.

భారతదేశం లక్ష్యం దిశగా పయనించడం లేదని, దేశాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యామ్నాయ ఎజెండా కావాల్సిందేనని అన్నారు. ఇందుకోసం అవసరమైన సమయంలో తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మనసులో మాట బయటపెట్టారు. దేశంలో ఇప్పటి వరకు చాలా ఫ్రంట్‌లు వచ్చి పోయాయని, వాటి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు కేసీఆర్.

కమ్యూనిస్టులతో పాటు కొన్ని పార్టీలు కలిసి రావాలని ఆహ్వానించినప్పటికీ.. ఎవరినో గద్దె దించడానికి, మరెవరినో గద్దెనెక్కించడానికి తాను సిద్ధంగా లేనని చెప్పేసినట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం ప్రాసెస్‌ చేసినట్లు అద్భుతమైన భారత్‌ కోసం ప్రాసెస్‌ జరగాలన్నారు సీఎం కేసీఆర్. ఆ ప్రక్రియలోనే భవిష్యత్ ఏంటో తెలుస్తుందన్నారు.

తానంటూ ఫ్రంట్‌ పెడితే.. అది భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంటు ఉంటది తప్ప.. దీనికి వ్యతిరేకం, దానికి దోస్తీ అన్నట్లు ఉండదన్న విషయాన్ని జార్ఖండ్‌లోనే చెప్పొచ్చినట్టు వివరించారు. దీనర్ధం.. తెలంగాణ నుంచే దేశ రాజకీయాలు నడిపించే ఓ రాజకీయ వేదిక ఏర్పాటు చేయబోతున్నారన్న టాక్‌ పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES