KCR: సారొస్తున్నాడు..

ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు, పార్టీ నేతలతో సమావేశాలను కూడా అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు కేసీఆర్. ఈ రెండేళ్లలో కేసీఆర్ ప్రజలకు కనిపించింది చాలా అరుదనే చెప్పుకోవాలి. అయితే తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు.నేడు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చి నెలలో చివరిసారిగా....
మార్చి నెలలో చివరిసారిగా ఆయన పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ వచ్చారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి ఏడాది దాటుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండేళ్లు సమయం ఇస్తానంటూ చెప్పిన కేసీఆర్, ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్లో నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గత రెండు రోజులుగా ఫామ్ హౌస్ లో నేతలతో చర్చలు జరుపుతున్నారు కేసీఆర్. ఇప్పటికే కేసీఆర్ బయటకు రావాలి.. అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే సెటైర్లు వేస్తున్నారు. పాలమూరు నీటి కేటాయింపుల విషయంలోనూ కేంద్రానికి రెండు పార్టీలు లేఖ రాద్దాం.. అసెంబ్లీలో చర్చిద్దాం.. రమ్మంటూ వెల్కమ్ కూడా చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ఎల్లుండి తెలంగాణ భవన్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? నీటి వాటాల విషయంలో మరో ఉద్యమానికి తెర తీస్తారా? అనేది ఆసక్తిగా మారింది. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెడతారా..? ప్రెస్ మీట్ లో ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇక వీటన్నిటితో పాటు రాజకీయ అంశాలు మాట్లాడాల్సి వస్తే, కవితపై కూడా స్పందిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెడతామని బీఆర్ఎస్ చెబుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనలపైనా కేసీఆర్ దృష్టి సారించారు.
రంగంలోకి కేసీఆర్..
భారత్ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (బీఆర్ఎస్ఎల్పీ) సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యచరణపై చర్చిస్తారు. అంతేకాకుండా రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రైతుల నీటి హక్కులపై మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పేరును నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌గా మార్చి ఏపీ ప్రభుత్వం మళ్లీ అదే పని చేస్తోందని మంత్రి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదు. ఇంకా చెప్పాలంటే.. బీజేపీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరి నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర విధానాన్ని ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు’’ అని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

