KCR BRS Party: జాతీయ పార్టీకి సినీ గ్లామర్ అద్దేందుకు కేసీఆర్ ప్లాన్.. ఆ ఇద్దరు నటులతో..

KCR BRS Party: జాతీయ పార్టీ విషయంలో KCR ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నారు. ఐదారు రోజుల్లో పార్టీ పేరు ఏంటనేది కూడా తేలిపోనుంది. భారత రాష్ట్ర సమితా, భారత రాజ్య సమితా, భారత నిర్మాణ సమితా.. అనే విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఐక్యత తేవడం ద్వారా BJPని, మోదీని ఢీ కొట్టడమే లక్ష్యంగా KCR వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటనలు, సన్నిహితులతో కీలక మంతనాలతో.. BRS నిర్మాణంపై ఓ స్పష్టత వచ్చిందంటున్నారు.
ఈనెల 19న దీనిపై అధికారిక ప్రకటన వస్తే.. ఆ వెంటనే ఆయా రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారనే దానిపై కూడా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం సినీ గ్లామర్‌ను వాడుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, సోనూసూద్ లాంటి వాళ్లు కొందర్ని కలుపుకుని వెళ్లడం ద్వారా ముందుగా జనాలకు చేరువ అవ్వాలనేది KCR ప్లాన్. ఇక ఇటు సోషల్ మీడియా ద్వారా KCR పాపులారిటీ పెంచే బాధ్యత PK టీమ్ తీసుకుంటుంది. ఇప్పటికే ఐప్యాక్ వాళ్లు KCR స్పీచ్‌లను ఉత్తరాదిన వైరల్ చేస్తున్నారు.
మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా BJP ప్రవర్తిస్తోందంటూ గతంలో KCR మాట్లాడిన మాటలు.. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై నిలదీస్తూ KCR వేసిన ప్రశ్నలు, సాగు చట్టాలపై ఉద్యమంలో చనిపోయిన వారికి ఆర్థిక సాయం అందించిన విషయం ఇలా కొన్నింటిని సెలక్టివ్‌గా తీసుకుని ఉత్తరాదిన కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సహజంగానే అందరినీ ఆకట్టుకునే కేసీఆర్ వాగ్దాటిని ఇతర రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేస్తే అది పార్టీ విస్తరణకు మేలు చేస్తుందనే అంచనాలతో అన్ని విధాలుగానూ యాక్షన్‌లోకి దిగిపోయింది PK టీమ్.
అన్నీ అనుకున్నట్టు జరిగితే పార్టీ ప్రకటన తర్వాత జులై మొదటి వారంలో ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెట్టాలని కూడా భావిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాది నుంచి జన సమీకరణ బాధ్యతను పీకే టీమ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. BRS పార్టీ ప్రకటించాక తెలంగాణ బయట ఈ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే దానిపై KCR ఇప్పటికే క్లారిటీతో ఉన్నారు. దక్షిణాదిన ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ను తెరపైకి తేవడం ద్వారా ఓ ప్రయోగం చేస్తున్నారు. గతంలో బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను, మాజీ సీఎం కుమారస్వామిని కలిసినప్పుడు KCR వెంట ప్రకాష్‌రాజ్ ఉన్నారు.
అలాగే మహారాష్ట్ర వెళ్లి CM ఉద్ధవ్ థాక్రేను కలిసినప్పుడు కూడా ప్రకాష్‌రాజ్ పక్కనే ఉన్నారు. ఆయనకు TRS నుంచి రాజ్యసభ ఇస్తారని కూడా ఇటీవల పెద్ద ప్రచారం జరిగింది. అది వాస్తవరూపం దాల్చకపోయినా కలిసి పనిచేసే విషయంపై ఇద్దరి మధ్య అవగాహన ఉందని.. సౌత్‌లో KCRకి సపోర్ట్‌గా ప్రకాష్‌రాజే కీరోల్ పోషిస్తారనే మాటైతే వినిపిస్తోంది. ఇక సోనూసూద్‌ను కూడా BRSలోకి ఆహ్వానిస్తున్నారు KCR. ముంబై కేంద్రంగా BRS కార్యకలాపాలు విస్తరించడానికి ఇలాంటి ఆప్షన్ ఎంచుకుంటున్నారు. సోనూ సూద్ సోదరి ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.
KCR కూడా ఇటీవలే పంజాబ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించారు. రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్ కూడా KCR పట్ల సానుకూల భావనతో ఉన్నారు. ఇలాటి ప్లస్ పాయింట్లతో ఆయా రాష్ట్రాల్లో ఎంట్రీకి ఇబ్బంది ఉండబోదు అనేది వ్యూహంగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా చూస్తే.. ప్రకాష్‌రాజ్, సోనూసూద్, రాకేష్ తియాకత్, ఉండవల్లి పేర్లు తెరపైకి వచ్చినట్టే.. తటస్థులుగా ముద్రపడిన వారు, మేధావి వర్గం నుంచి కొందరు BRSలో కీరోల్ పోషించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రత్యమ్నాయ రాజకీయ అజెండా సిద్ధం చేసే క్రమంలో ఏయే వర్గానికి ఎలా చేరువ కావాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ KCR పెట్టే జాతీయ పార్టీ కార్యకలాపాలు మొదలుపెడుతుందట. ఆ బాధ్యతలు మాజీ ఎంపీ ఉండవల్లికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆయన తాను రాజకీయాల నుంచి రిటైరనట్టు చెప్తున్నారు. KCRతో మరో దఫా కూడా సమావేశం అవుతున్న ఆయన దీనిపై నెక్స్ట్ ఏమంటారు అనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు BJPని ఎదుర్కొనే సత్తా లేదని చెప్తున్న ఉండవల్లి.. ఏపీలో అడుగు పెట్టేందుకు KCRకు ఎలాంటి ప్లాన్ ఇచ్చారనేది కూడా ఆసక్తికరంగానే మారింది. విభజన అశాస్త్రీయంగా జరిగిందంటూ ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్న ఉండవల్లి.. KCRతో ఏమేరకు కలుస్తారనేది కూడా వేచి చూడాలి.
ఓ పక్క రాజకీయ వ్యూహకర్త పీకేతో.. మరోపక్క సినీ గ్లామర్‌తో BRSను ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న వారితో ఆయా రాష్ట్రాల్లో ఎలా వ్యవహరిస్తారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా తయారైంది. ఉదాహరణకు కర్నాటకనే తీసుకుంటే అక్కడ JDS చీఫ్‌తో సత్సంబంధాలున్నాయి. తమిళనాడులో స్టాలిన్‌నూ KCR స్వయంగా వెళ్లి కలిసారు. బెంగాల్‌లో తృణముల్ చీఫ్ మమత కావచ్చు, UPలో అఖిలేష్ కావచ్చు, జార్ఖండ్‌లో JMM కావచ్చు, మహారాష్ట్రలో శివసేన కావచ్చు.. అవసరానికి ఆయా పార్టీతో చర్చిస్తూ థర్డ్‌ఫ్రంట్‌లో కీరోల్ పోషించాలని నిన్నటి వరకూ భావించారు.
ఇప్పుడు కూటమి కాదని ఏకంగా జాతీయ పార్టీనే తెరపైకి తెచ్చారు. దీన్ని ఆయా పార్టీలు ఎలా చూస్తాయి అనేది చర్చనీయాంశమైంది. KCR జాతీయ పార్టీ ప్రకటన తర్వాత వారి రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా భవిష్యత్‌లో పార్టీ విస్తరణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. KCR జాతీయ పార్టీ ప్రకటిస్తే ఇప్పుడు TRS గుర్తుపై పోటీ చేసిన వారంతా వచ్చే ఎన్నికల్లో BRS నుంచి పోటీ చేస్తారు.
కారు గుర్తుపైనే పోటీ చేసేందుకు ఏం చేయాలి, TRSను జాతీయ పార్టీగా మారిస్తే ఆ ఆస్తులు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ కూడా ఎలా బదిలీ చేయాలి, ECకి ఎలాంటి సమాచారం ఇవ్వాలనే దానిపైనా న్యాయనిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. ఇక.. BJPని ఢీకొట్టే సత్తా ఒక్క KCRకే ఉందంటున్నఆ పార్టీ నేతలు జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి అయితే.. దేశానికి కేసీఆర్ మినహా మరో ప్రత్యమ్నాయం లేదని కుండబద్దలుకొట్టినట్టు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com