KCR: కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణతో గులాబీ పార్టీలో జోష్

సుదీర్ఘ విరామం తర్వాత పబ్లిక్‌లోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన భవిష్యత్ యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ గంటన్నర సేపు సుదీర్ఘ ప్రసంగం చేశారు. జనవరిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. కృష్ణాజలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని, ఈ విషయంపై ప్రజలకు అన్ని అంశాలు వివరించాలని సూచించారు. మొదట మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయాల్లోనూ కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు పై కీలక ఆదేశాలు ఇచ్చారు. కేసీఆర్ ప్రకటించిన ఈ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు బీఆర్ఎస్‌ను భారీగా దెబ్బకొట్టాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించింది. అయితే ప్రభుత్వం మారాక కేసీఆర్ ఈ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాలతో ముడిపడిన కృష్ణా నీటి అంశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఇవే జిల్లాల్లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. మరి కేసీఆర్ గేమ్‌కు అధికార పక్షం ఎలా చెక్ పెట్టబోతోందన్నది ఉత్కంఠగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్‌ను ‘టీఆర్ఎస్’గా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన పాత పేరు అయిన టీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది పొరపాటున అన్నారా..? లేదా కావాలనే అన్నారా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీతో పాటు ఇతర పార్టీ కీలక నేతలతో కలిసి సమావేశం పెట్టుకున్నామని చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

