KCR: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ దళపతి కేసీఆర్!

అసెంబ్లీకి హాజరుకావాలని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని.. అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని పార్టీ నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా దీటుగా బదులిచ్చారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీంతో.. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా ఉండే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్ష్యం ప్రతి విమర్శలు గుప్పించింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అసెంబ్లీలో హోరాహోరీ తప్పదు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, తెలంగాణకు జలాల విషయంలో ద్రోహం తలపెట్టినా, రేవంత్‌రెడ్డి ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు తాగునీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి, ఉద్యమాన్ని నిర్మిస్తానని కేసీఆర్ హెచ్చరించారు. ఆ తర్వాత కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ గౌరవానికి తనది పూచీ అని రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణకు తాగునీళ్ల విషయమై సభలో కేసీఆర్ నిలదీసే అవకాశం వుంది. అయితే ఎన్నిరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే అంశంపై సమస్యల ప్రస్తావన ఆధారపడి వుంటుంది. అసెంబ్లీకి కేసీఆర్ వెళితే, సభ హాట్‌హాట్‌గా సాగే అవకాశం వుంది. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటే చర్చ హోరాహోరీగా సాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్-రేవంత్ మాటల యుద్ధం ఎలా సాగుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

