KCR Munugodu: మోదీ.. నీ అహంకారమే నీకు శత్రువు: కేసీఆర్
KCR Munugodu: మునుగోడు గడ్డపై నుంచి కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు సీఎం కేసీఆర్.

KCR Munugodu: మునుగోడు గడ్డపై నుంచి కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై నిప్పులు చెరిగారు. బిడ్డా అమిత్‌షా .. నీళ్లవాటా తేల్చాకే మునుగోడులో అడుగు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. మోదీ నీ అహంకారమే నీకు శత్రువంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈడీలు బోడీలకు భయపడను.. ఏం చేసుకుంటారో చేసుకోమంటూ సవాల్ విసిరారు.
మునుగోడు జీవితాల ఎన్నిక అన్నారు సీఎం కేసీఆర్. బీజేపీని గెలిపిస్తే ఆగమైపోతామని హెచ్చరించారు. మోదీకి ఓటేస్తే తనను పక్కకు నెట్టి.. బావుల దగ్గర మీటర్లు పెడుతారని వార్నింగ్ ఇచ్చారు. తన బలమే ప్రజలన్న సీఎం కేసీఆర్.. బీజేపీని గెలిపించి బలహీన పరచొద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ వాళ్లు చేయరు.. చేసే వాళ్లకు అడ్డుపడుతారంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్. పెన్షన్లతో పైసలన్నీ వృథా చేస్తున్నారని కేంద్రం అరిచిందని చెప్పుకొచ్చారు. కులపిచ్చి, మతపిచ్చితో దేశాన్ని నాశనం చేస్తున్నారని.. మోదీ హయంలోనే రూపాయి విలువ ఇంత దారుణంగా పతనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు కాంగ్రెస్‌పైనా దాడికి దిగారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ సచ్చిన పామని.. వాళ్లకు ఓటేసినా దండగే అంటూ విమర్శించారు.ఇక మునుగోడు సభలోనే సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరిగినా అలా చేయలేదు. అసంతృప్తుల నేపథ్యంలో క్యాండిడేట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు గులాబీ బాస్. అంతకుముందు హైదరాబాద్ నుంచి 5వేల కార్ల భారీ కాన్వాయ్‌తో మునుగోడుకు వెళ్లారు సీఎం కేసీఆర్. దీంతో విజయవాడ- హైదరాబాద్ హైవేపై పోలీసులు ఆంక్షలు విధించారు. భారీగా ట్రాఫిక్ జామై జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.