KCR: ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులతో కేసీఆర్ భేటీ..
KCR (tv5news.in)
KCR: పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ పోరుకు సిద్ధమైన సీఎం కేసీఆర్... ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులతో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను కలిసి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి.. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఢిల్లీలో కేంద్రం వ్యవహరించిన తీరుపై మంత్రులు కేసీఆర్‌కు వివరించారు.
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తమ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించిన తీరును కేసీఆర్ కు మంత్రులు వివరించినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేలా మంత్రులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కార్యాచరణను సిద్ధం చేసే అవకాశముంది. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని వ్యాఖ్యానించిన పూయుష్ గోయల్.. రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కేంద్ర మంత్రి వెలికి వేషాలు మానుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా, కించపరిచేలా మాట్లాడిన గోయల్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచారని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉత్తర భారతానికో నీతి, దక్షిణ భారతానికో నీతి అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com