BRS: నేడు ఖమ్మానికి కేసీఆర్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు బీఆర్‌ఎస్ అధినేత KCR నేడు హాజరుకానున్నారు. ఇప్పటికే జిల్లాలో మూడు బహిరంగ సభలకు హాజరైన KCR..ఇవాళ రెండు సభలకు హాజరవుతారు. కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా స్థానిక ప్రకాశం మైదానంలో మధ్యాహ్నం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్యమంత్రి KCR హాజరై గులాబీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన KCR ఆ తర్వాత నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం వచ్చారు. మళ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కొత్తగూడెం రానున్నారు. హెలికాప్టర్‌లో ప్రగతిమైదానం చేరుకుని క్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. చాలారోజుల తర్వాత సీఎం జిల్లా కేంద్రానికి వస్తుండటంతో గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంతో కొత్తగూడెం పరిసరాలన్నీ గులాబీ మయంగా మారాయి. ప్రధాన రహదారుల్లో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కొత్తగూడెం బహిరంగ సభ తర్వాత KCR ఖమ్మం ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరవుతారు. ఈ ఏడాదే జనవరి 18న ఖమ్మం గడ్డపై నుంచే బీఆర్‌ఎస్ ఆవిర్బావ బహిరంగ సభకు KCR హాజరయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కు మద్దతుగా మాట్లాడేందుకు హాజరవుతున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. గులాబీ దళపతి హాజరయ్యే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రి పువ్వాడ అజయ్ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని డివిజన్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ గులాబీ మయమయ్యాయి. ఇప్పటికే సభస్థలిలో ఏర్పాట్లను మంత్రి పువ్వాడ, MP నామా నాగేశ్వరరావు, MLC తాతామధుసూదన్ పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావాలని మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. రెండు బహిరంగ సభలకు పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసు అధికారులు.. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం, ఖమ్మంలో బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసులు... సీఎం పర్యటన దృష్ట్యా ఆంక్షలు విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com